కుక్కకాటుకు గురైన 95 ఏళ్ల వృద్ధురాలు రేబిస్ టీకా కోసం 20 కిలోమీటర్లు నడిచిన వెళ్లి వచ్చిన ఘటన ఒడిశా రాష్ట్రంలో వెలుగు చూసింది. రాష్ట్రంలో గత రెండ్రోజులుగా ప్రైవేటు వాహనాల డ్రైవర్లు సమ్మె నిర్వహిస్తుండడంతో.. ప్రయాణించేందుకు వాహనాలు లేక ఆమె కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. వివరాళ్లలోకి వెళితే.. నువాపడ జిల్లా సీనాపల్లి సమితి శికబాహల్ గ్రామానికి చెందిన మంగల్‌బారి మోహరా(92)కు అనే వృద్ధురాలికి ఇటీవల కుక్కకరిచింది. దీంతో ఆమె పక్క ఊరైన సీనాపల్లి సీహెచ్‌సీలో చికిత్స తీసుకుంది. అయితే బుధవారం ఆమె చివరి యాంటీ-రేబిస్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం ఆమె సీనాపల్లికి వెళ్లాలనుకుంది. కానీ రాష్ట్రంలో సమ్మె కారణంగా వారు వెళ్లేందుకు ఏ వాహనమూ దొకరలేదు.. దీంతో ఆమె తన కొడుకుతో పాటు తన గ్రామం నుంచి నుంచి 10 కి.మీ. దూరంలోని సీనాపల్లికి కాలినడకన వెళ్లి.. అక్కడ టీకా వేయించుకున్న తర్వాత మళ్లీ నడిచే ఇంటికి వచ్చారు. ఆరోగ్యం క్షీణించి, వయసు పైబడుతున్నప్పటికీ, ఆ వృద్ధ మహిళ చేతి కర్ర, తన కుమారుడు గురుదేవ్ సహాయంతో హాస్పిటల్‌కు వెళ్లిరాగలిగింది.
ఈ ఘటనపై స్పందించిన డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గా చరణ్ బిషి మాట్లాడుతూ.. తాము సమ్మె నిర్వహిస్తున్నప్పటికీ.. అవసరమైన సేవలకు మాత్రం ఎలాంటి అంతరాయం కలిగించలేదని స్పష్టం చేశారు. బాధిత కుటుంబం ఈ ప్రత్యేక పరిస్థితి గురించి తమకు తెలియజేసి ఉంటే..తాము ఖచ్చితంగా వారికి అవసరమైన సహాయం అందించేవాళ్ళమని ఆయన తెలిపారు. వాహనాలు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకోవడం వారి కుటుంబ సభ్యుల బాధ్యత అని.. అలా చేయకుండా సంఘాన్ని నింధించడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఆలా కాకపోతే వారు సహాయం కోసం అంబులెన్స్ ఫోన్ చేసి ఉండోచ్చని అన్నారు.
మరోవైపు ఇదే విషయంపై వృద్దురాలి కుమారుడు గురుదేవ్ మాట్లాడుతూ.. టీకా కోసం 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయవచ్చో లేదో తమకు ఖచ్చితంగా తెలియదని.. తాము వేరే వాళ్ల దగ్గర నుంచి ద్విచక్ర వాహనాన్ని అరువుగా తీసుకున్నా కూడా దానిపై తన తల్లి కూర్చోలేకపోయేదని తెలిపాడు. తమకు వేరే వాహనం దొరకలేదు కాబట్టే కాలినడకన వెళ్లి చికిత్స చేయించుకున్నట్టు గురుదేవ్ వివరించాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.