99 రూపాయలకే నాణ్యమైన సిల్క్ చీర, 49 రూపాయలకే ఎగ్ బిర్యానీ అంటూ బాపట్ల జిల్లా పర్చూరులో ఓ వ్యక్తి దుకాణం పెట్టాడు. తక్కువ ధరలకే ఇటు చీరలు, అటు బిర్యానీ లభిస్తుండటంతో జనం బాగానే రావడం మొదలుపెట్టారు… వ్యాపారం సూపర్ హిట్టయింది… రోజురోజుకు కలెక్షన్లు పెరుగుతున్నాయి… తక్కువ ధరలకు చీరలు కొనేందుకు మహిళలు ఎక్కువగా రావడం మొదలుపెట్టారు… గోదావరిజిల్లాకు చెందిన దుకాణం యజమాని తనను తాను వెంకటేశ్వర్లుగా పరిచయం చేసుకున్నాడు… తక్కువ ధరలకే చీరలు కొంటున్న వారిలో ధనవంతుల కుటుంబాలకు చెందిన మహిళలు కూడా రావడంతో వీరిని టార్గెట్ చేసుకున్నాడు… తన వ్యాపార విస్తరణ కోసం పెట్టుబడి కావాలని, అధిక వడ్డీ ఇస్తానని ఆశచూపాడు… అంతే ఒకరికి తెలియకుండా ఒకరు ఆ వ్యాపారికి రెండు కోట్ల రూపాయల వరకు అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చేశారు… వ్యాపారం కూడా బాగా జరుగుతోంది… చెప్పిన సమయానికి వడ్డీ కూడా ఇస్తున్నాడు… అంతా బాగుందని, అధిక వడ్డీ వస్తుందని ఆ నోటా, ఈ నోట విన్న మధ్య తరగతి మహిళలు కూడా వెంకటేశ్వర్లుకు అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చారు… ఇలా అంతా 2 కోట్లు కాగానే రాత్రికి రాత్రి వెంకటేశ్వర్లు బిచాణా ఎత్తేశాడు… దీంతో అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చిన మహిళలు లబోదిబోమంటూ న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు..
పోలీస్ స్టేషన్ ఎదుటే దుకాణం…
గోదావరి జిల్లాలకు చెందిన ఓ వ్యక్తి తన పేరు వెంకటేశ్వర్లు అని చెప్పుకొని పర్చూరు పోలీస్ స్టేషన్ ఎదుటే సంవత్సరం క్రితం ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు… 99 రూపాయలకే నాణ్యమైన సిల్కు చీర, 49 రూపాయలకే ఎగ్ పలావు ఇస్తానంటూ ఇంటి ముందు బోర్డులు పెట్టాడు. చీరల కోసం అక్కడికి వచ్చిన మహిళలను తన వాక్చాతుర్యంతో ఆకట్టుకున్నాడు . తాను బాపట్ల వాసిని అంటూ వారికి తన నకిలీ ఆధార్ కార్డుని కూడాచూపించాడు . కొంతకాలం గడిచిన తర్వాత తాను వడ్డీ వ్యాపారం కూడా చేస్తానని అందరినీ నమ్మబలికాడు… పదివేలు ఇస్తే నెలకు 2 వేలు వడ్డీ కలిపి 12 వేలు ఇస్తానని ఆశచూపించాడు.. ఇలా రెండు మూడు నెలలు క్రమం తప్పకుండా ఇచ్చాడు. విషయం తెలుసుకున్న గ్రామంలోని మహిళలు, అత్యాశపరులు ఒక్కొక్కరు 10 వేల నుండి 10 లక్షల వరకు అతనికి ముట్టజెప్పారు. కొందరైతే ఇంట్లో ఉన్న బంగారాన్ని సైతం బ్యాంకులో తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకెళ్లి ఇచ్చారు. ఇలా సుమారు 80 మంది దగ్గర 2 కోట్లకు పైగా వసూలు చేసుకొని రాత్రికి రాత్రే మకాం మార్చేసి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు . అతడికి ఫోన్ పనిచేయకపోవడంతో అతనికోసం గ్రామస్థులు వెతికారు… వెంకటేశ్వర్లుగా పరిచయం చేసుకున్న వ్యక్తి ఆచూకీ లభించకపోవడంతో తాము మోసపోయామని గ్రహించి తీవ్ర ఆవేదన చెందారు. అతను ఎక్కడున్నా పట్టుకొని తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇదంతా పర్చూరు పోలీస్ స్టేషన్ ఎదుటే జరగటంతో పోలీసులు కూడా విస్తుపోతున్నారు.