
“మా మామయ్యకు పెద్ద ఉద్యోగం లేదు. వ్యాపారం చేయలేదు. స్టాక్స్ ట్రేడ్ చేయలేదు. సాధారణంగా వచ్చే జీతంతో సాదాసీదా పనిచేశారు” అని మేనల్లుడు వివరించాడు. అతని మామయ్య విజయం వెనుక ఎలాంటి రహస్య పెట్టుబడి వ్యూహం లేదు. ముందుగానే పెట్టుబడులు పెట్టడం, ఆ పెట్టుబడులను నిలకడగా కొనసాగించడమే ఆయన విజయానికి కారణం.
1998లో ప్రారంభం: చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలియని రోజుల్లో, 1998లో ఆయన నెలకు రూ. 10,000తో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టారు.
SIPతో వృద్ధి: ఆ తర్వాత రూ. 500తో SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ప్రారంభించారు. జీతం పెరిగిన కొద్దీ, పెట్టుబడి మొత్తాన్ని క్రమంగా పెంచుకుంటూ పోయారు.
2010 నాటికి: “2010 నాటికి, ఆయన నెలకు రూ. 20,000 పెట్టుబడి పెట్టారు. ఎప్పుడూ ఆపలేదు” అని మేనల్లుడు చెప్పాడు.
45 ఏళ్లకే పదవీ విరమణ ఎలా సాధ్యమైందని అడిగితే, మామయ్య తన పాస్‌బుక్, ప్రింట్ చేసిన CAMS స్టేట్‌మెంట్ చూపించారు. మొత్తం అక్షరాలా రూ. 4.7 కోట్లు!
నిరాడంబర జీవితం.. నిశ్శబ్ద స్వేచ్ఛ
ఆయన మామయ్య జీవిత విధానం అందరినీ ఆకర్షిస్తుంది. మూడు దశాబ్దాలకు పైగా ఒకే 2BHK అపార్ట్‌మెంట్‌లో నివసించారు. జీవితంలో ఎక్కువ కాలం స్కూటర్ వాడారు. ఒకే ఒక్కసారి కేరళకు వెకేషన్‌కు వెళ్ళారు. ఎలాంటి విలాసాలకు, ఖరీదైన వస్తువులకు ఆయన ఆశపడలేదు. పదవీ విరమణ తర్వాత కూడా ఆయన సంపదను ఎక్కడా ప్రదర్శించరు. కేవలం నిశ్శబ్ద స్వేచ్ఛను అనుభవిస్తున్నారు.
“ఇప్పుడు ఆయన, మా అత్త దాదాపు ప్రతి వారాంతం ప్రయాణాలు చేస్తారు. పిల్లలకు ఆయన ఆస్తి గురించి ఏమీ తెలియదు. ఏదైనా ఆచరణాత్మకమైన సలహా కావాలంటే మామయ్యే నాకు మొదటి ఎంపిక. నిజాయతీగా చెప్పాలంటే, నాకు కావాల్సిన నిజమైన స్ఫూర్తి ఆయనే” అని మేనల్లుడు తన పోస్ట్ ముగించాడు.
ఈ సామాన్యుడి కథ నిరూపించేది ఏంటంటే, ఆర్థిక స్వాతంత్య్రం అనేది మీరు ఎంత సంపాదిస్తున్నారు అన్న దానిపై కాదు. ఎంత నిలకడగా ఆదా చేస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు అన్న దానిపై ఆధారపడుతుంది.