
తమిళనాడు నాగపట్టణం జిల్లా కీచంకుప్పం సమీపంలో సీ క్యూకంబర్లు అనే సముద్ర జీవులను అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పెద్ద ఎత్తున వాటిని పట్టుకున్నారు. శనివారం జరిగిన ఈ ఆపరేషన్‌లో 150 కిలోల సీ క్యూకంబర్లు సీజ్ చేశారు. వీటి విలువ సుమారుగా రూ. 4 లక్షలు ఉంటుందని అంచనా. ఈ దాడిని అటవీశాఖ అధికారులు, మెరైన్ పోలీసులు కలిసి నిర్వహించారు. ఇది ఈ నెలలో జరిగిన మూడవ సీజ్ కావడం గమనార్హం. తరచూ జరుగుతున్న ఈ అక్రమ రవాణా నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
అధికారులకు వచ్చిన సమాచారం మేరకు కీచంకుప్పం సాల్ట్ రోడ్ ప్రాంతంలోని శ్మశానవాటిక వెనుక భాగంలో దాడులు నిర్వహించారు. అక్కడ ఉప్పుతో నింపిన ప్లాస్టిక్ డబ్బాలలో ఈ సీ క్యూకంబర్లను దాచి ఉంచినట్టు గుర్తించారు. వీటిని రామేశ్వరం మార్గంగా శ్రీలంకకు తరలించేందుకు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ అక్రమ రవాణా వెనుక మురుగనంధం అనే వ్యక్తి హస్తం ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అతను సాల్ట్ రోడ్‌కు చెందినవాడు. దాడి సమయంలో అతను అక్కడి నుండి పరారయ్యాడు. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం… ఇతనిపై గతంలోనే 20కి పైగా సీ క్యూకంబర్ అక్రమ రవాణా కేసులు ఉన్నాయి.
సీ క్యూకంబర్లు తూర్పు ఆసియాలో ఓ రెసిపీగా.. సాంప్రదాయ ఔషధాల్లో ఉపయోగిస్తారు. కానీ భారత్‌లో ఇవి వన్యప్రాణి రక్షణ చట్టం షెడ్యూల్ – Iలో ఉన్నాయి. అంటే వీటి వేట, నిల్వ, రవాణా, అమ్మకాలు పూర్తిగా నిషేధించారు. ఈ జీవులు సముద్ర అడుగుని శుభ్రంగా ఉంచడంలో, సముద్ర జీవవైవిధ్యాన్ని కాపాడడంలో చాలా కీలకంగా ఉంటాయి. అందుకే వాటి సంరక్షణ అవసరమని అధికారులు చెబుతున్నారు. ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ఈ తరహా ఘటనల నేపథ్యంలో నాగపట్టణం తీరప్రాంతం మొత్తంలో నిఘా పెంచినట్లు అధికారులు వెల్లడించారు. అక్రమంగా సముద్ర జీవులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.