లెక్చరల్ వేధింపులు తాళలేక ఓ కాలేజ్ విద్యార్థిని పెట్రోల్ పోసుకొని నిప్పింటించుకున్న ఘటన ఒడిశాలోని బాలాసోర్‌లో చోటుచేసుకుంది. ప్రమాదంలో విద్యార్థినికి 95 శాతం కాలిన గాయాలు కాగా, ఆమెను కాపాడటానికి ప్రయత్నించిన తోటి విద్యార్థికి కూడా 70 శాతం గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే. ఒడిశాలోని బాలాసోర్‌లో ఉన్న ఫకీర్ మోహన్ కళాశాలలో ఇంటిగ్రేటెడ్ బి.ఎడ్ ప్రోగ్రామ్ చదువుతున్న ఓ విద్యార్థిని జూలై 1న కాలేజ్ అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఒక ఫిర్యాదు చేసింది.తన క్లాస్ HOD సమీర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని.. తనకు సహకరించకపోతే భవిష్యత్తును నాశనం చేస్తానని బెదిరింపులకు పాడ్పతున్నట్టు ఆమె పేర్కొంది. అయితే తన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కాలేజ్ వర్గాలు ఏడు రోజుల్లో అతనిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా.. ఎటువంటి చర్యలు తీసుకోలేదని దర్యాప్తులో తేలింది.
దీంతో HOD సమీర్‌పై చర్యలు తీసుకోవాలని శనివారం బాధిత మహిళతో పాటు తోటి విద్యార్థులు కళాశాల గేటు ముందు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో బాధిత విద్యార్థిని తనతో తెచ్చుకున్న పెట్రోల్‌ను తీసుకొని ఒక్కసారిగా అక్కడి నుంచి లేచి ప్రిన్సిపాల్ ఆఫీస్ వద్దకు పరిగెత్తింది. అక్కడ తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. నొప్పిని భరించలేక కళాశాల ప్రాంగణంలో పరుగులు తీసింది. అది గమనించిన తోటి విద్యార్థులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించి మంటలను అదుపు చేశారు. అప్పటికే ఆమె శరీరం 95 శాతం మేర కాలిపోయింది. ఇంక వెంటనే ఆమెను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన సదరు విద్యార్థికి కూడా గాయాలు అయ్యారు. ప్రస్తుతం ఇద్దరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఘటనపై నమోదు చేసుకున్న పోలీసులు టీచర్ సాహును అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.
అయితే విద్యార్థి ఫిర్యాదును నమోదు చేశామని, అంతర్గత కమిటీ నివేదిక సమర్పించే ప్రక్రియలో ఉందని కళాశాల ప్రిన్సిపాల్ దిలీప్ ఘోష్ తెలిపారు. విద్యార్థిని అదే రోజు తన ఆఫీస్‌కు వచ్చి.. తాను తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు తనకు చెప్పిందని.. సాహును ఆఫీసుకు పిలవమని ఆమె తనను అడిగినట్టు ప్రిన్సిపాల్ ఘోష్ తెలిపారు. సాహును పిలిపించి ఇద్దరితో మాట్లాడినట్టు తెలిపారు. సాహు విద్యార్థిని మాటలను ఖండించారని ఆయన చెప్పుకొచ్చారు.
మరోవైపు విద్యార్థిని ఆత్మహత్యాయత్నంతో కాలేజ్‌లో నిరసనలు తీవ్రమయ్యాయి. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు టీచర్ సమీర్ సహును అరెస్ట్ చేసిట్టు బాలసోర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజ్ ప్రసాద్ తెలిపారు.ఇదిలా ఉండగా విషయం కాస్తా విద్యాశాఖ దృష్టికి చేరడంతో ఘటనపై రాష్ట్ర ఉన్నత విద్యా మంత్రి సూర్యబన్షి సూరజ్ స్పందించారు. ఘటన జరిగిన కళాశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసినట్టు ఆయన తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.