విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. పేదరికంతో కన్నబిడ్డను పెంచలేక పొత్తిళ్ళలో ఉన్న పసికందును అమ్మిన ఘటన అందరినీ కలిచివేస్తుంది. నగరంలోని బుంగవీధికి చెందిన ఒక కుటుంబం రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ దంపతులకు ఇప్పటికే ముగ్గురు సంతానం ఉన్నారు. వారిలో ఒక మగబిడ్డ, ఇద్దరు ఆడబిడ్డలు కాగా ఇటీవల వీరికి నాలుగో సంతానంగా మరో ఆడపిల్ల జన్మించింది. కుటుంబ భారం, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పుట్టిన పాపను పెంచలేమని భావించిన తల్లిదండ్రులు దగ్గర బంధువులతో కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ శిశువును తమ సమీప బంధువుకు విక్రయించారు. ఈ ఘటన వారం రోజుల క్రితమే జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై స్థానికంగా చర్చ జరగడంతో జిల్లా బాలల సంరక్షణ అధికారుల దృష్టికి చేరింది. దీంతో ఐసీపీఎస్ అధికారులు బిడ్డ తల్లిదండ్రులను వ్యక్తిగతంగా కలిసి జరిగిన ఘటనపై ఆరా తీశారు. అయితే విచారణలో బిడ్డ తండ్రి పొంతనలేని సమాధానం చెప్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సోమవారం బిడ్డతో కలసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుకావాలని తల్లిదండ్రులకు ఆదేశించారు.
మరోవైపు తమ బిడ్డను తన సోదరికి పెంచుకునేందుకు ఇచ్చినట్లు పాప తల్లిదండ్రులు చెబుతున్నారు. బిడ్డను అనధికారంగా ఇవ్వడం చట్టరీత్యా నేరమని తమకు తెలియదని, నిభందనలు ఉన్నాయని అవగాహన లేదని వారు చెప్పుకొచ్చారు. బిడ్డను పెంచలేక తన సోదరికి పెంచడానికి ఇచ్చామని అంటున్నారు. అయితే అసలు బిడ్డ తమ బంధువుల వద్ద ఉందా? లేక ఇంకెక్కడైనా ఉందా? అసలు ఎక్కడైనా క్షేమంగా ఉందా? లేదా అనే అనేక ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి. తల్లి పాలు త్రాగాల్సిన పసికందు తల్లిదండ్రులకు దూరం కావడంపై జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఈ విషయంపై బాలల హక్కుల పరిరక్షణ సంఘాలు స్పందించాయి. బిడ్డను పెంచడం కష్టమైతే ఆ బిడ్డ సంరక్షణ ప్రభుత్వం చూసుకుంటుందని, అలా పొత్తిళ్ళలో ఉన్న బిడ్డను విక్రయించడం అమానుషమని అన్నారు. బిడ్డ అమ్మకానికి సంబంధించిన సమాచారం తమకు కూడా ఆలస్యంగా అందిందని ఘటనపై విచారణ ప్రారంభించామని డిసిపిఓ లక్ష్మీ తెలిపారు. బిడ్డకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అంటున్నారు. అయితే జరిగిన ఘటన వెనుక మానవహక్కుల ఉల్లంఘన ఉందని, ఘటనకు పాల్పడిన వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ సంఘం నేతలు కోరుతున్నారు. అంతేకాకుండా వెంటనే పసికందు ఎక్కడ ఉందో గుర్తించి వెంటనే బిడ్డ భద్రత పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.