Shubman Gill and Zak Crawley Heated Argument: భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట చివరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంగ్లండ్ ఓపెనర్లు సమయం వృథా చేస్తున్నారంటూ భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించాడు. చివరి ఐదు నిమిషాల్లో జరిగిన ఈ డ్రామా క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగింది?
మూడో రోజు ఆట ముగియడానికి కొన్ని నిమిషాల ముందు, భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇది ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ స్కోరుతో సమానం. దీంతో ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి వచ్చింది. ఆట ముగియడానికి ఆరు నిమిషాలు, రెండు ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఈ సమయంలో ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ క్రీజ్‌లోకి వచ్చారు.
అయితే, జస్ప్రీత్ బుమ్రా మొదటి ఓవర్‌ను వేయడానికి సిద్ధమవుతున్నప్పుడు, జాక్ క్రాలీ పదేపదే తన స్టాన్స్ నుంచి పక్కకు తప్పుకోవడం, చిన్నపాటి గ్లవ్ టచ్‌కే ఫిజియోను పిలవడం వంటి ‘టైమ్ వేస్టింగ్’ టెక్నిక్స్‌ను అనుసరించాడు. దీని వల్ల బుమ్రా వేయాల్సిన ఓవర్ ఆలస్యం అయ్యింది. రెండు ఓవర్లు వేయాలనే ఉద్దేశంతో ఉన్న భారత జట్టు, క్రాలీ తీరుతో ఒక ఓవర్ మాత్రమే వేయగలిగింది.
గిల్ ఆగ్రహం..
క్రాలీ సమయం వృథా చేయడాన్ని గమనించిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అతను క్రాలీ వైపు వేలు చూపిస్తూ, కోపంగా దూషించడం స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యింది. “ధైర్యం చూపించు” అంటూ గిల్ అరవడం వినిపించింది. ఈ సన్నివేశంలోనే బెన్ డకెట్ కూడా జోక్యం చేసుకోవడంతో, గిల్-డకెట్ మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది. భారత ఆటగాళ్లు కూడా వ్యంగ్యంగా చప్పట్లు కొడుతూ ఇంగ్లండ్ ఓపెనర్ల తీరును నిరసించారు.
డకెట్ స్పందన..
Always annoying when you can’t get another over in before close 🙄 pic.twitter.com/3Goknoe2n5
— England Cricket (@englandcricket) July 12, 2025
శుభ్‌మన్ గిల్ వ్యాఖ్యలకు బెన్ డకెట్ కూడా తీవ్రంగా స్పందించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో మ్యాచ్‌లో ఉద్రిక్తత మరింత పెరిగింది. చివరికి బుమ్రా తన ఓవర్‌ను పూర్తి చేసిన తర్వాత, ఆట ముగిసింది.
ఈ సంఘటనపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు శుభ్‌మన్ గిల్ ఆగ్రహాన్ని సమర్థించగా, మరికొందరు ఇలాంటి పరిస్థితుల్లో సంయమనం పాటించాలని అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్ బౌలింగ్ కన్సల్టెంట్ టిమ్ సౌథీ మాట్లాడుతూ, నిన్న గిల్ కూడా కండరాల నొప్పి అంటూ సమయం వృథా చేశాడని గుర్తు చేశారు. అయితే, భారత ఓపెనర్ కేఎల్ రాహుల్, “ఆరు నిమిషాలు మిగిలి ఉన్నప్పుడు రెండు ఓవర్లు వేయడం సహజం. చివరి ఐదు నిమిషాల్లో ఏం జరిగిందో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌కు బాగా తెలుసు. ఇది కొద్దిగా నాటకీయత” అని వ్యాఖ్యానించాడు.
ఏదేమైనా, ఈ సంఘటన లార్డ్స్ టెస్టుకు మరింత మసాలాను అద్దింది. సిరీస్ 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో, ఈ వాగ్వాదం నాల్గవ రోజు ఆటపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. క్రికెట్‌లో ఇలాంటి ఉద్రిక్తతలు సహజమే అయినప్పటికీ, ఆటగాళ్లు స్పోర్ట్స్‌మెన్‌షిప్‌ను నిలబెట్టుకోవడం ముఖ్యమని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..