గురుగ్రామ్‌లో టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాధికను ఆమె తండ్రే కాల్చి చంపిన కేసులో పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కూతురు సంపాదన మీద బతుకుతున్నావని తండ్రిని కొంతమంది ఎగతాళి చేయడంతో బిడ్డను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఆమెకు మరో వ్యక్తితో లవ్ ఎఫైర్ ఉందని.. అది నచ్చక చంపేశారనే ప్రచారం నడిచింది. ఈ క్రమంలో తన ఫ్రెండ్ సంచలన విషయాలు వెల్లడించింది. రాధిక చనిపోయిన మూడు రోజుల తర్వాత స్పందించిన ఆమె ఫ్రెండ్ హిమాన్షిక.. రాధికను ప్రతి విషయంలో ఆమె తండ్రి కంట్రోల్లో ఉండాలంటూ ఇబ్బంది పెట్టేవాడని ఆరోపించింది. బట్టలు, అబ్బాయిలతో మాట్లాడడంపై నిరంతరం విమర్శలతో ఆమె జీవితాన్ని దుర్భరం చేశాడని చెప్పింది. తనకు నచ్చినట్లుగా రాధిక బతకలేకపోయిందని చెప్పారు.
తనకు నచ్చినట్లు మాత్రమే బతకాలని రాధికను తండ్రి నిత్యం తిట్టే వాడని హమాన్షిక చెప్పింది. పొట్టి బట్టలు ధరించడం, అబ్బాయిలతో మాట్లాడినందుకు ఎన్నో సార్లు ఆమెను తీవ్రంగా అవమానించాడని తెలిపింది. ‘‘నా ప్రాణ స్నేహితురాలు రాధికను ఆమె సొంత తండ్రి హత్య చేశాడు. ఆమెను ఐదుసార్లు కాల్చాడు. నాలుగు బుల్లెట్లు ఆమె శరీరలోకి దూసుకెళ్లాయి. తన కఠినమైన ఆంక్షలతో ఆమె జీవితాన్ని చీకటిగా మార్చేశాడు. రాధిక తన టెన్నిస్ కెరీర్‌లో చాలా కష్టపడింది. తన సొంత అకాడమీని ఏర్పాటు చేసుకుని చాలా బాగా రాణిస్తోంది. కానీ ఆమె స్వతంత్రంగా ఉండటం చూసి తండ్రి ఓర్చుకోలేకపోయారు. పైకి మాత్రం తన కూతురు తన మాట వినడం లేదని అందరికీ చెప్పుకునేవాడు. ఆమె సొంతంగా బతకడమే ఆమెకు శాపంగా మారింది’’ అని హిమాన్షిక తెలిపింది.
2012 నుంచి రాధికతో కలిసి ఆడినట్లు హిమాన్షిక గుర్తు చేసుకుంది. ఆమె బయట ఎవరితో ఎక్కువగా మాట్లాడడం ఎప్పుడూ చూడలేదన్నారు. ఇంట్లో ఆంక్షల వల్ల ఆమె సైలెంట్‌గా ఉండేదని.. తన ప్రతి కదలికను ఆమె తండ్రి గమనించేవాడని చెప్పుకొచ్చింది. ‘‘వీడియో కాల్స్‌లో ఆమె ఎవరితో మాట్లాడుతున్నారో చెక్ చేసేవారు. ఒకసారి నేను వీడియో కాల్ చేశాను. వారి తల్లిదండ్రులకు అబ్బాయితో మాట్లాడుతుందని డౌట్ వచ్చింది. చివరకు ఫోన్ వాళ్లకు చూపించి నాతో మాట్లాతున్నట్లు చెప్పాల్సి వచ్చింది. ఆమెకు వీడియోలు తీయడం, ఫోటోలు తీయడం చాలా ఇష్టం. కానీ ఇంట్లోవాళ్ల వల్ల అవన్నీ వదిలేసుకుంది’’ అని చెప్పింది. రాధిక హత్యకు లవ్ ఎఫైర్ కారణం కాదని హిమాన్షిక స్పష్టం చేసింది. అసలు తనను ఎవరితో మాట్లాడనిచ్చేవారు కాదని.. అలాంటప్పుడు లవ్ అనే పేరు ఎలా వస్తుందని ప్రశ్నించిన హిమాన్షిక.. దానికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేసింది. మరోవైపు పోలీసులు సైతం లవ్ జీహాద్ వంటివి ఏమిలేవని తేల్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..