టాలీవుడ్ లెజెండరీ నటుడు కోటా శ్రీనివాస రావు మరణంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. కృష్ణాజిల్లా కంకిపాడులో 1942, జులై 10న జన్మించారు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి. దీంతో చిన్న వయసు నుంచే నాటకాల్లో పాల్గొనేవారు.
సినిమాలలో రాకముందు స్టేట్ బ్యాంకులో పనిచేసిన కోటా.. అదే సమయంలో నాటకాల్లో పాల్గొనేవారు. 1978 లొ ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ సినిమాతో ఆయనకు తొలి అవకాశాన్ని ఇచ్చారు దర్శక నిర్మాత క్రాంతి కుమార్. ప్రతిఘటన చిత్రంతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
నాలుగు దశాబ్దాల సినీప్రయాణంలో దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించారు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా, విలన్ గా ఇలా ఎన్నో పాత్రలు పోషించి మెప్పించారు. తన నటనతో విలనిజానికి కొత్త అర్థం చెప్పారు కోట శ్రీనివాసరావు.
సినీరంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ ఒత్తిడితో రాజకీయాల్లోకి వచ్చారు. స్వతహాగా వాజ్ పేయి అంటే చాలా ఇష్టం. 1990లో బీజేపీలో చేరి 1999లో విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత రాజకీయాల నుంచి విరమించుకుని మళ్లీ నటనలోనే కొనసాగారు. ఆ త్రవాత వందల సినిమాల్లో నటించి 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. తన సినీ ప్రయాణంలో తొమ్మిది నంది పురస్కారాలు అందుకున్నారు.