మా కోటన్న ఇక లేడూ.. అంటూ బాబూ మోహన్ భోరుమంటుంటే చూపరులందరికీ కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. వాళ్లిద్దరినీ స్క్రీన్ మీద చూసిన మనకే.. అయ్యో.. పాపం అనిపిస్తుంటే.. కలిసి ఆరు పదుల సినిమాలు చేసిన వారి అనుబంధం ఎలా ఉంటుందో ఊహించుకోగలం అంటున్నారు. వారిద్దరూ కలిసి జనాలకు నవ్వులు పంచిన సినిమాలను గుర్తుచేసుకుంటున్నారు. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో మా జంట అలా కలిసింది. మేమిద్దరం ఎక్కడ కనిపించినా చుట్టూ ఉన్నవారికి సరదాగా అనిపించేది. కెమెరా ముందే కాదు, కెమెరా వెనుక కూడా అంతే సరదాగా ఉండేవాళ్లం అని గుర్తుచేసుకుంటున్నారు బాబూమోహన్.
ఇద్దరు వ్యక్తుల మధ్య కెమిస్ట్రీ ఎంత కుదిరితే, సీన్స్ అంతలా పండుతాయో అర్థం చేసుకోగలం అని అంటున్నారు ఆడియన్స్. ఒకటా, రెండా వారిద్దరూ కలిసి నటించిన సినిమాల్లోని సన్నివేశాలను పదే పదే గుర్తుచేసుకుంటున్నారు. కోటకు సరిగ్గా పలకడం రాకపోతే బాబూ మోహన్ నేర్పించడం, కోట డబ్బులిచ్చి ఇడ్లీలు తీసుకురమ్మంటే.. బాబూ మోహన్ ఇడ్లీలు మాత్రమే తీసుకురావడం.. ఇలా సినిమాల్లో ప్రతి సన్నివేశం విజువల్ ఫీస్ట్ అయింది. ఫ్యామిలీతో కలిసి గడిపిన సమయం కంటే, బాబూమోహన్‌తో కలిసున్న సమయమే ఎక్కువగా ఉండేదని చెప్పుకునేవారు కోట. మంచీ చెడులను బాబూ మోహన్‌తో చెప్పుకునేవాడినని అనేవారు. తన తనయుడు పోయినప్పుడు బాబూమోహన్ అండగా నిలిచిన తీరుని మర్చిపోలేనని చెప్పేవారు.
రోజుకు మూడు షిఫ్టులు పనిచేసేవారు కోట – బాబూమోహన్. ఇంట్లో కన్నా ఔట్ డోర్ షూటింగులలోనే ఎక్కువగా ఉండేవారు. చాలా సందర్భాల్లో ఒకచోట నుంచి మరో చోటికి వెళ్లడానికి ట్రైన్ టిక్కెట్స్ దొరికేవి కాదు.. అలాంటి సమయాల్లో దొరికిన ఒకటీ అరా సీట్లలో సర్దుకుని ట్రావెల్ చేసిన రోజుల్ని గుర్తుచేసుకునేవారు. ఔట్‌డోర్ షూటింగులకు వెళ్లినప్పుడు చెరొక రూమ్‌ని ప్రొడక్షన్ యూనిట్ కేటాయించినా, ఎక్కువగా ఒక రూములోనే కలిసి ఉండే ఆప్యాయత వారిద్దరిదీ. సొంత అన్నదమ్ముల్లాగే మెలిగేవాళ్లం. ఏరోజూ ఆయన నన్ను ఒక మాట అనలేదు. ఒకవేళ కెమెరా ముందు తిట్లు తిట్టాల్సి వచ్చినా.. ‘నువ్వేం అనుకోకురా.. ‘ అని చెప్పి మరీ తిట్టేవారని గుర్తుచేసుకుంటున్నారు బాబూమోహన్.
ఇవి కూడా చదవండి
అంతే కాదు, ప్రతి సన్నివేశాన్ని చేయడానికి ముందు.. ‘అన్నా నేనిలా చేస్తా.. ‘ అని బాబూ మోహన్ అంటే, ‘దానికి నేనిలా కౌంటర్ ఇస్తా’ అని కోట చెప్పిన తీరును కూడా గుర్తుచేసుకుంటున్నారు వారితో పనిచేసిన వారు. అంతలా ఒకరితో ఒకరు మాట్లాడుకుని, ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుని ముందుకు సాగడం వల్లనే తాము నటించిన సినిమాల్లోని సన్నివేశాలు అంత బాగా పండాయన్నది ఇద్దరి మాటా. మావగారు, హలో బ్రదర్, చినరాయుడు, పెదరాయుడు, మాయలోడు, జంబలకిడి పంబ.. అలా వారిద్దరి కాంబినేషన్‌లో చెప్పుకుంటూ పోతే ఆరు పదుల సినిమాలున్నాయి. ప్రతి సినిమాలోనూ అరడజనుకు తక్కవ కాకుండా కామెడీ పండించిన సన్నివేశాలున్నాయి..
కోట శ్రీనివాసరావు – బాబూ మోహన్ తండ్రీ కొడుకులుగా, అన్నదమ్ములుగా, స్నేహితులుగా, గురు శిష్యులుగా, ఈర్ష్యా అసూయలున్న ఇద్దరు వ్యక్తులుగా.. ఎన్నెన్నో కేరక్టర్లు చేశారు. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. కంట తడి పెట్టించారు. ఆలోచింపజేశారు. నలుగురు కలిసిన చోట వారి మాటల్లో నిలిచారు. ఇప్పుడు వారిలో అన్న లేడు.. తమ్ముడు విలవిలలాడుతున్నాడు… కోట ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాడు.. ఆఖరి క్షణం వరకు సినిమాల గురించి, షూటింగుల గురించి మాట్లాడుకున్న వారి ఆత్మీయతను తెలుగు ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోరు. సినిమా ఉన్నంత కాలం.. చిరకాలం గుర్తుంచుకుంటూనే ఉంటారు.