రిటైర్డ్ టీచర్ నన్నేషా హుస్సేన్‌కు విద్యుత్ శాఖ వారు ఊహించని షాక్ ఇచ్చారు. ఏకంగా 15 లక్షలకు పైగా కరెంట్ బిల్లు రావడంతో ఆయన దిమ్మతిరిగింది. ప్రతి నెల వెయ్యి రూపాయలు వచ్చే బిల్లు.. ఒక్కసారిగా లక్షల్లోకి ఎలా పెరిగిందో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. డిజిటల్ మీటర్లు వచ్చాకే బిల్లులు పెరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కోనసీమ జిల్లాలో జరిగింది. అధికారులు స్పందించి న్యాయం చేస్తారో లేదో చూడాలి.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక వింత సంఘటన జరిగింది. మామిడికుదురు మండలం మామిడికుదురు గ్రామంలో రిటైర్డ్ టీచర్ నన్నేషా హుస్సేన్ ఇంటికి ఏకంగా రూ. 15,14,993 కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో ఆయన షాక్ అయ్యారు. ప్రతి నెల రూ. 1300 వరకు బిల్లు వచ్చేది. కానీ ఈసారి మాత్రం భారీగా బిల్లు రావడంతో ఆయన విద్యుత్ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నన్నేషా హుస్సేన్ మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం డిజిటల్ మీటర్లు పెట్టినప్పటి నుండి సామాన్యులపై కరెంట్ బిల్లుల భారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ మీటర్లు వచ్చినప్పటి నుంచి సామాన్యులపై కరెంట్ బిల్లుల భారం అధికమైంది అని ఆయన అన్నారు. అధికారులు ఈ విషయాన్ని విచారించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తనకు వచ్చిన బిల్లును చూసి ఆయన చాలా ఆందోళన చెందుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో బిల్లు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని ఆయన వాపోతున్నారు.
గత కొన్ని రోజులుగా ఏపీలో కరెంట్ వైర్లను తాకకుండానే ప్రజలకు షాక్ తగులుతోంది. విద్యుత్ సిబ్బంది నిర్వాకంతో బిల్లుల్లో పొరపాట్లు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలు నిత్యం ఎన్నో జరుగుతున్నాయి.కానీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కొన్ని రోజుల క్రితం రాజోలు మండలం పొదలాడకు చెందిన ఓ కిరాణా షాపు ఓనర్’కి లక్ష రూపాయలు పైగా కరెంట్ బిల్లు విధించి షాకిచ్చారు అధికారులు.
నెల రోజులకే రూ.1,01,603 వచ్చిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై ఆ శాఖ ఏఈను వివరణ కోరగా.. ఆ షాప్‌కి కొన్ని రోజుల క్రితమే కొత్తగా స్మార్ట్‌మీటర్ బిగించారని.. పాత మీటర్‌లోని రీడింగ్ కూడా కలిసిపోయి అధిక మొత్తంలో వచ్చిందని వివరించారు. దీన్ని సరిచేశామని తెలిపారు.