తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు ఉండవచ్చు గాక.. ఈయనది మాత్రం ప్రత్యేక శైలి. కెరీర్ తొలినాళ్లలో చిన్నా చితకా పాత్రల్లో నటించిన ఆయన ఆ తర్వాత తనే హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా మారారు. కమర్షియల్ కట్టుబాట్లకు దూరంగా సామాజిక చైతన్యాన్ని, సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించే చిత్రాలు రూపొందిస్తున్నారు. ఇప్పటికీ అదే పంథాతో, ఒకే భావజాలంతో సినిమాలు తీస్తూ సమాజంలోని అన్యాయాలను ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పటివరకు 30కు పైగా సినిమాల్లో నటించి, నిర్మించిన ఆయన హంగులు, ఆర్భాటాలకు దూరం. ఒక చిన్న అద్దె గదిలో నివాసముంటారు. ఎప్పుడూ ఆటోలు, ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తారు. అందుకే ఈ నటుడన్నా, ఆయన సింప్లిసిటీ అన్నా అందరికీ గౌరవం. అయితే ఈ నటుడి గురించి ఇటీవల కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. పైకి చూడడానికి సాధారణ మనిషి లాగా కనిపించే ఆయన ఎన్నో మంచి పనులు చేశారట. ముఖ్యంగా తన సొంతూరిలో రూ. 2 కోట్లతో ఆస్పత్రిని కట్టించారట. ఈ విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు. పైగా కోట్లు కట్టించిన ఆస్పత్రికి తన పేరు గానీ, తన తల్లిదండ్రుల పేరుగానీ పెట్టుకోలేదట. అలాగే అదే ఊర్లో ఆలయం కూడా కట్టించాడు. ఇంత చేసినా ఏనాడూ ఇది చేశాను అని చెప్పుకోలేని ఆ నటుడు మరెవరో కాదు పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తి.
ఆర్. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘యూనివర్సిటీ (పేపర్ లీక్)’. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ప్రముఖ ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న , అద్దంకి దయాకర్, దేశపతి శ్రీనివాస్, అందెశ్రీ తదితరులు మాట్లాడారు. ఆర్ నారాయణమూర్తి గొప్ప తనం, ఆయన చేపట్టిన మంచి పనుల గురించి కొనియాడారు. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ‘ ఆర్.నారాయణమూర్తి లాంటి వ్యక్తులు ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు సమాజంలోనూ అరుదుగా ఉంటారు’..
ఇవి కూడా చదవండి
‘వెయ్యిమంది కాదు.. పదివేల మంది ఒక్కో లక్ష రూపాయులు ఇచ్చేంత ఫ్రెండ్స్ నారాయణ మూర్తికి ఉన్నారు. సొంతూరులో రెండు కోట్లు పెట్టి ఒక హాస్పిటల్ కట్టించి నాగం జనార్ధన్ రెడ్డి గారి పేరుతో ప్రజలకు అంకితం చేశారాయన. దానికి ఆయన తన పేరు గానీ, తన తల్లిదండ్రుల పేరుకాని పెట్టుకోలేదు. అందరి కన్నా ముందు వారి ఊర్లో ఆయన నాన్నగారి కోరిక మేరకు ఆలయం కట్టించారు. కానీ వీటి గురించి ఆయన ఏ నాడు చెప్పుకోలేదు’ అని పీపుల్స్ స్టార్ గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు గోరటి వెంకన్న

R Narayana Murthy
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..