
పెండ్లి పత్రికలు పంచే పనిలో ఉన్న ఇద్దరు యువకులు ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని కొమురం భీం చౌరస్తా వద్ద శనివారం చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇంధన్‌పల్లి గ్రామానికి చెందిన చొప్పదండి లక్ష్మన్‌కు వారం రోజుల్లో పెండ్లి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బంధువైన మురిమడుగు జస్వంత్‌తో కలిసి బైక్‌పై నిర్మల్ వైపు పెండ్లి పత్రికలు పంచడానికి బయలుదేరాడు.
అయితే ఖానాపూర్ చేరుకునేలోపే బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న కల్వర్టును ఢీకొని చెట్ల పోదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లక్ష్మన్, జస్వంత్ ఇద్దరూ తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే మృతి చెందారు.
మరి కొన్ని రోజుల్లో ఇంట్లో శుభకార్యం అనుకుంటున్న వేళ జరిగిన ఈ విషాదం కుటుంబాన్ని విషాదసంద్రంలోకి నెట్టింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి