కల్మషం లేని వ్యక్తిగతం.. అడుగడుగునా కలుపుగోలుతనం.. అహర్నిశలూ శ్రమించే విధానం.. అనుకున్నదాన్ని సాధించుకునే తత్వం.. అభిమానం చాలనుకునే మనస్తత్వం… తెలుగు సినిమా వన్నెల మాట.. కోట! ఆయనిప్పుడు లేరు… కానీ, ఆయన జ్ఞాపకాలు కోకొల్లలు. ఆయన పంచిన ఆప్యాయతానురాగాలు మెండు. ఆయన చూపించిన బాట గొప్పది. ఆయన నడిచొచ్చిన దారి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఇప్పుడు ఎవరిని కదిలించినా ఈ మాటలే..
విలక్షణమైన నటనకు పరిపూర్ణమైన రూపం కోట అన్నది మెగాస్టార్ మాట. వారిద్దరూ కలిసి సినిమా ప్రయాణాన్ని ప్రాణం ఖరీదుతో మొదలుపెట్టారు. సెట్లో కోట ఉంటే చమత్కారాలకు కొదవ ఉండదన్నది చిరు మాట.

Chiranjeeevi
కోట శ్రీనివాసరావు నటించిన ఆఖరి సినిమా హరిహరవీరమల్లు. ఆ సినిమా కోసమే ఆయన చివరి సారి గళం విప్పారు. ఆ సినిమాతోనే కాదు.. అంతకు ముందు కూడా చాలా సినిమాల్లో పవర్‌స్టార్‌తో కలిసి నటించారు కోట శ్రీనివాసరావు. పవన్ కల్యాణ్‌కి ఇష్టమైన నటుడు కోట. చెప్పాలనుకున్న విషయాన్ని నిర్భయంగా చెప్పడంలో కోట తర్వాతే ఎవరైనా అన్నది పవన్ కల్యాణ్‌్ మాట.

Kota Srinivas Rao
ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ ఫస్ట్ సినిమా నుంచే కాదు, వెంకటేష్ ఫస్ట్ సినిమా నుంచి కూడా అనుబంధాన్ని పెంచుకున్నారు కోట. కలియుగ పాండవుల నుంచి వెంకటేష్‌తో అనుబంధం ఉంది కోట శ్రీనివాసరావుకి. సురేష్ ప్రొడక్షన్స్ లో చాలా సినిమాల్లో నటించారు కోట. అలాంటి వెర్సటైల్ యాక్టర్ ఇవాళ లేకపోవడం తనకు వ్యక్తిగతంగా తీరని లోటంటారు వెంకటేష్. శత్రువు, గణేష్ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే…ఇలా తమ కాంబినేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నది విక్టరీ హీరో మాట.

Venkatesh
బాబాయ్ వెంకటేష్‌తో పాటు, అబ్బాయ్ రానా కూడా నివాళులర్పించారు. సురేష్ ప్రొడక్షన్స్ తో కోటకున్న బంధం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అటు దిల్‌రాజు కూడా తమ సంస్థతో కోట శ్రీనివాసరావు చేసిన సినిమాలను గుర్తుచేసుకున్నారు. వైవిధ్యమైన పాత్ర, సంక్లిష్టమైన కేరక్టర్ ఉందంటే చటుక్కున గుర్తుకొచ్చే పేర కోటదే అని మనసులోని మాటలను వ్యక్తం చేశారు దిల్‌రాజు.
సిల్వర్ స్క్రీన్ మీద శ్రీకాంత్‌కి తండ్రి రోల్స్ చేసిన వారిలో ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయే పేరు కోట శ్రీనివాసరావు. రియల్ లైఫ్‌లో కోటని బాబాయ్ అని పిలుస్తారు శ్రీకాంత్. సీతారత్నంగారి అబ్బాయి నుంచి మొదలైన వారి ప్రస్థానాన్ని చెబుతూ ఎమోషనల్ అయ్యారు శ్రీకాంత్. ‘బిగినింగ్ డేస్ నుంచి ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నామన్నది శ్రీకాంత్ చెప్పిన మాట. ఆయన కొడుగ్గా చేయాలంటే చాలా చాలా ఛాలెంజింగ్‌గా అనిపించేదని, అయినా ఆయన దగ్గరుండి ప్రోత్సహించేవారన్నది ఆయనతో పని చేసిన ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట.

Srikanth
మనిషి ఉన్నప్పుడు నలుగురూ కలవడం, కనిపించడం వేరు. తిరిగి రాని లోకాలకు వెళ్లిన వ్యక్తి కోసం పదిమందీ అదేపనిగా తరలిరావడం వేరు. చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడులాంటి రాజకీయ ప్రముఖులే కాదు… అచ్చిరెడ్డి, సి.కల్యాణ్, శివాజీరాజాతో పాటు పలువురు సినీ ప్రముఖులు కడసారి చూపుల కోసం తరలి వచ్చారు.
మానసిక కష్టాలను అధిగమించడానికి నటనను నమ్ముకున్న నటుడు కోట శ్రీనివాసరావు. తుది శ్వాస విడిచే వరకు నటించాలన్నదే ఆయన ధ్యేయం. ఎస్వీ రంగరావు తర్వాత అంతటి నటుడు కోట అన్నది త్రివిక్రమ్ మాట. కోట కనుమూయడంతో ఓ చరిత్ర ముగిసిందన్నది త్రివిక్రమ్ మాట. వ్యక్తిగతంగా కూడా అనుబంధం ఉన్న డైరక్టర్ త్రివిక్రమ్.

Trivikram
తెలుగు సినిమాకు కోట సేవ ఎనలేనిది. శేఖర్ కమ్ములలాంటి యువ దర్శకులకు ఆయనంటే అమితమైన ఇష్టం. దర్శకనిర్మాతలకి ఇష్టమైన నటుడు ఆయన. తెలుగు సినిమా మనుగడకి తనవంతు సాయం చేయడానికి ముందుండే వ్యక్తి కోట అన్నది శేఖర్ కమ్ముల మాట.

Shekar Kammula
నిర్మాతల ఫేవరేట్ నటుడన్న మాటను శేఖర్ కమ్ముల మాత్రమే కాదు.. సి.కల్యాణ్ కూడా చెప్పారు. తన సినిమాలకు డబ్బులు తీసుకోకుండా పనిచేసిన నటుడు అంటూ భావోద్వేగానికి గురయ్యారు సి.కల్యాణ్.
కోట శ్రీనివాసరావుతో పనిచేసిన వారే కాదు.. పనిచేయని వారు కూడా అనుబంధాన్ని పంచుకున్న సందర్భాలున్నాయి. నిలుచోలేకపోయినా.. కూర్చోనైనా, ఓపిక తెచ్చుకుని నటిస్తా.. ఓ కేరక్టర్ ఇవ్వూ అంటూ తనతో పలు ఫంక్షన్లలో కోట చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు అనిల్ రావిపూడి. డైరక్టర్‌గా చేయకపోయినా.. అసిస్టెంట్ డైరక్టర్‌గా ఆయనతో పనిచేసిన ఎక్స్ పీరియన్స్ ని పంచుకున్నారు అనిల్.
కోట గురించి ఈ తరంవారే కాదు.. పాత తరం దర్శకులు కూడా చాలా విషయాలను పంచుకున్నారు. మద్రాసు నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిన కొత్తలో, దర్శకనిర్మాతలకు కోట సహకరించిన తీరు అద్భుతం అన్నది ఇండస్ట్రీలో మళ్లీ మళ్లీ వినిపించే మాట
– కోదండ రామిరెడ్డి.
నవరసాలను అద్భుతంగా పలికించే నటుడు కోట. ఆయన ఎక్కడుంటే అక్కడ జోష్ ఉంటుంది. చుట్టూ ఉన్నవారందరూ సరదాగా ఉంటారు. నలుగురిలో ఉంటూనే.. నలుగురినీ గమనిస్తూ ఉంటారు. వారి వ్యావహారిక శైలిని అలవాటు చేసుకుంటారు. వాటిని కెమెరా ముందు అద్భుతంగా ఆవిష్కరిస్తారన్నది ఆయనతో పనిచేసిన దర్శకుల మాట.
– రేలంగి నరసింహారావు
కోట గురించి చెప్పాలంటే రోజులు సరిపోవనే దర్శకుల సంఖ్యకూ కొదవలేదు. శివ సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేసిన శివ నాగేశ్వరరావు.. అప్పటి రోజులనే కాదు, ఆ తర్వాత కూడా ఆయనతో కొనసాగిన బంధాన్ని చెబుతుంటే, విన్నవారు కంటతడి పెట్టుకున్నారు.
– శివనాగేశ్వరావు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావుకు ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి తెలుగు ఇంటికీ పరిచయం ఉన్న నటుడు కోట. ఆ మాటకొస్తే తెలుగే కాదు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లోనూ నటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గురించి సహనటులు ఆత్మీయంగా చాలా విషయాలే పంచుకున్నారు.
- అహనా పెళ్లంట సినిమా చూడని తెలుగు వారు ఉండరన్నది రాజేంద్రప్రసాద్ ఇచ్చిన స్టేట్‌మెంట్. ఆ సినిమాతో మొదలైన తమ జర్నీ.. ఆ నలుగురు వరకూ కంటిన్యూ అయ్యిందని, సినిమాకు మించిన వ్యక్తిగత అనుబంధం తమ మధ్య ఉందని చెప్పారు రాజేంద్రప్రసాద్. కోట శ్రీనివాసరావుని మావా అని పిలవగల చనువున్న నటుడు రాజేంద్రప్రసాద్.
- అందరికీ సినిమా నటుడిగా కోట శ్రీనివాసరావు పరిచయం ఉంటే, తనకు నాటక రంగం నుంచే పరిచయం ఉందన్నారు తనికెళ్ల భరణి. కమిట్‌మెంట్, తపనతో నాటకాల్లోనూ, సినిమాల్లోనూ రాణించారని మెచ్చుకున్నారు.
- కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్ అనుబంధం గురించి ఎవరికీ ప్రత్యేకంచి చెప్పాల్సిన అవసరం లేదు. సిల్వర్ స్క్రీన్ మీద ఆరు పదుల సినిమాల్లో నటించిన బంధం వారిది. సినిమాల్లోనే కాదు, బయట కూడా పాము – ముంగిస లాగా సరదాగా కౌంటర్లు వేసుకుంటూ ఉండేవారు ఇద్దరూ. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్నదమ్ములం మేం అంటారు బాబూ మోహన్. తన అగ్రజుడిని పోగొట్టుకుని విలవిలలాడుతున్నానన్నది ఆయన మాట.
- బాబూ మోహన్‌తోనే కాదు.. బ్రహ్మానందంతోనూ అంతటి అనుబంధమే ఉంది కోట శ్రీనివాసరావుకి. అరే.. ఒరేయ్ అనుకునే చనువు వారిది. నాలుగు దశాబ్దాలుగా రోజుకు 18 – 20 గంటలు కలిసి పనిచేసిన అన్యోన్యత వారిది. నటన ఉన్నంత కాలం కోట ఉంటారని, అలాంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికి, నటనా లోకానికి తీరని లోటంటారు బ్రహ్మానందం.
- కోట సినిమాల గురించి తెలుగు నటులే కాదు… తెలుగులోకి రావాలనుకున్న నటులు కూడా చాలా తెలుసుకునేవారు. రచయిత, దర్శకులు రాసిన డైలాగుల్ని అలాగే చెప్పేయడం కోటకు ఎప్పుడూ అలవాటు లేదు. ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని నటించే వారు కోట. తాను సినిమాల్లోకి రావడానికి ముందు కోట సినిమాలను చూశానని చెప్పారు ప్రకాష్‌రాజ్. పరభాషా నటుల మీద కోటకున్న అప్రోచ్ గురించి మాట్లాడారు ప్రకాష్‌రాజ్.
- ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ తర్వాత ఆ స్థాయికి చేరిన నటుడు కోట అన్నది అందరూ చెప్పిన మాట. ఆయన్ని దగ్గర నుంచి చూసిన అనుభవం ఉన్న అలీ కూడా అదే మాటను చెబుతూ ఎమోషనల్ అయ్యారు. కోటతో తనకున్న రిలేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నది ఆలీ మాట.
- ఈ నెల 10న పుట్టినరోజు జరుపుకున్నారు కోట శ్రీనివాసరావు. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన రెండు రోజులకే, ఇలా నివాళులు అర్పించాల్సి రావడం దురదృష్టకరమని భోరుమంటున్నారు సహ నటులు. రాజీవ్ కనకాల, కవితతో పాటు ఇంకా ఎందరెందరో ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
కోట ఎవరినీ మెప్పించే ప్రయత్నం చేయలేదు. ఉన్నదున్నట్టుగా మాట్లాడేవారు. అలాగని ఆయన అందరివాడు కాకపోలేదు. భోళా మనిషిగా.. నిక్కచ్చిగల వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. తరాల మధ్య అంతరాన్ని తీర్చే వారధిగ నిలిచారు. కోట అంటే ఇప్పుడు మామూలు నటుడు కాదు.. నట విశ్వవిద్యాలయం. సినిమా ఇండస్ట్రీ ఉన్నన్నాళ్లు గుర్తుండిపోయే విలక్షణ నటనాలయం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..