మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో పట్టపగలు వలస వచ్చిన ఓ ఆటో రిక్షా డ్రైవర్‌ను ఉద్ధవ్ థాకరే శివసేన (UBT),రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) పార్టీ కార్యకర్తలు దారుణంగా కొట్టారు. ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు వలస వచ్చిన ఒక వ్యక్తి విరార్‌లో నివాసం ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇతను కొన్ని రోజల కిందట విరార్ స్టేషన్ సమీపంలో ఓ యువకుడితో వాగ్వాదం పెట్టుకున్నాడు. ఆటో ఎక్కిన సదురు యువకుడు మరాఠీలో మాట్లాడడంతో.. తనకు మరాఠీ రాదని.. హిందీలేదా, భోజ్‌పురిలో మాట్లాడమని ఆటో డ్రైవర్ యువకుడిపై అరిచాడు. అది గమనించిన కొందరు ఈ తతంగాన్నంత వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వీడియో కాస్త వైరల్‌గా మారింది.
డ్రైవర్ మరాఠీ మాట్లాడేందుకు నిరాకరించిన వీడియో స్థానిక రాజకీయ పార్టీలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీంతో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) కార్యకర్తలు శనివారం ఆదే స్టేషన్ సమీపంలో ఆ ఆటో డ్రైవర్‌ను అడ్డగించారు. మరాఠీ భాషను అవమానించేలా మాట్లాడావని, తమ మనోభావాలను దెబ్బతీశావని ఆరోపిస్తూ ఆటో డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మహిళా కార్యకర్తలు సైతం పాల్గొని అతని చెంపలపై కొట్టారు. అంతే కాకుండా అతనితో స్థానిక ప్రజలకు క్షమాపణ కూడా చెప్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దాడి సమయంలో అక్కడే ఉన్న శివసేన (UBT) విరార్ నగర చీఫ్ ఉదయ్ జాదవ్ ఈ చర్యను సమర్థించారు. మరాఠీ భాషను, మహారాష్ట్రను అవమానించే ఎవరికైనా శివసేన ఇదే తరహాలో సమాధానం ఇస్తుందని తెలిపాడు. మరో స్థానిక కార్యకర్త స్పందిస్తూ డ్రైవర్‌కు తగిన గుణపాఠం నేర్పించారని అన్నాడు.
వీడియో చూడండి..
Auto driver is beaten by Shivsena and MNS workers for disrespecting the Marathi language…#MarathiNews #marathilanguagerow #Virar#palghar #MBVVpolice @Dev_Fadnavis @DGPMaharashtra pic.twitter.com/mxkPYUES4L
— Indrajeet chaubey (@indrajeet8080) July 13, 2025
ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి పోలీసుల దృష్టికి చేరినప్పటికీ.. దీనిపై అధికారింకంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎలాంటి కేసు కూడా నమోదు కాలేదని స్థానిక పోలీసులు తెలిపారు. వైరల్ వీడియో తమ దృష్టికి వచ్చిందని.. దాడికి వెనక ఉన్న వాస్తవాలపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.