అరటిపండు.. సీజన్ తో పనిలేకుండా లభించే పండు. చాలా సులభంగా తక్కువ ధరకే దొరుకుతుంది ఈ పండు. చాలా ఇండ్లలో అరటి తప్పకుండా ఉంటుంది. అన్ని వయసుల వారు దీనిని ఇష్టంగా తింటారు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా ఫైబర్, పొటాషియం, విటమిన్ బీ6 వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. అరటిని తింటే తక్షణ శక్తి లభిస్తుంది. అయితే అరటి తింటే బరువు పెరుగుతారా..? లేక తగ్గుతారా అనేది చాలా మందికి డౌట్. దీనికి సంబంధించి ఆరోగ్య నిపుణులు కీలక విషయాలు చెబుతున్నారు.
మీడియం సైజు అరటిపండులో సుమారుగా.. 105 కేలరీలు, 27 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3 గ్రాముల ఫైబర్, 1.3 గ్రాముల ప్రోటీన్, 0.3 గ్రాముల కొవ్వు ఉంటాయి. అంటే అరటిపండు తక్కువ కొవ్వు, అధిక ఫైబర్, అధిక శక్తి కలిగిన పండు అని అర్ధం. అరటిపండును అధికంగా, టైమ్ కాని టైమ్‌లో తింటే బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజుకు 2-3 అరటిపండ్లు తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. అరటిపండులో కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెర పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మీరు దానిని తిన్న తర్వాత తగినంత శారీరక శ్రమ చేయకపోతే అది శరీరంలో కొవ్వుగా మారుతుంది. అప్పుడు అటోమేటిక్‌గా బరువు పెరుగుతారు.
అరటి తింటే బరువు తగ్గుతారా..?
అరటి పండును సమతుల్య పరిమాణంలో, సరైన సమయంలో తినడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీనిలో ఉండే ఫైబర్ ఎక్కువసేపు కడుపును నిండుగా ఉంచుతుంది. దీంతో వెంటనే ఆకలివేయదు. కాబట్టి తక్కువ తినడం వల్ల బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది. వ్యాయామానికి ముందు అరటిపండు తినడం వల్ల శక్తి లభిస్తుంది. ఇది కొవ్వును కరిగించడంలోనూ సహాయపడుతుంది. కానీ దీని కోసం ప్రతిరోజూ వ్యాయామం చేయడం ముఖ్యం. రోజుకు ఒకటి కంటే ఎక్కువ అరటిపండ్లు తినకూడదు.
డైటీషియన్లు ఏమి సిఫార్సు చేస్తారు?
రోజుకు ఒక అరటిపండు తినడం పూర్తిగా సురక్షితం, ఆరోగ్యకరమైనదని డైటీషియన్లు చెబుతున్నారు. ఉదయం అల్పాహారం లేదా వ్యాయామానికి ముందు అరటిపండు తినడం మంచిదని చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు స్మూతీలో అరటిపండును చక్కెర లేదా పాలతో కలపొద్దు. బరువు పెరగాలనుకుంటే.. అరటిపండును పాలు, గింజలు, వేరుశెనగ, వెన్న లేదా పెరుగుతో తీసుకుంటే మంచి లాభాలు ఉంటాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..