Janasena Rayudu Family Request To Pawan kalyan: శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త రాయుడు హత్య కేసు సంచలనం రేపుతోంది. ఈ కేసులో జనసేన నేత కోట వినుత దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తమిళనాడు పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. అయితే తన అన్న హత్య వెనుక కోట దంపతుల హస్తం ఉందని శ్రీనివాసులు అలియాస్ రాయుడు చెల్లెలు కీర్తి ఆరోపించారు. తమను కూడా చంపేస్తామని బెదిరించారని.,. పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

మరోవైపు శ్రీనివాసులు అలియాస్ రాయుడుది పేద కుటుంబం. అమ్మానాన్న లేరు. అమ్మమ్మ వద్దే ఉంటున్నాడు. అప్పుడప్పుడూ అమ్మమ్మ వద్దకు వెళ్లివస్తున్న శ్రీనివాసులు జూన్ 21 నుంచి ఇంటికి రాలేదు. దీంతో అప్పటి నుంచి కుటుంబసభ్యులు కంగారుపడుతుండగా.. శ్రీనివాసులు దారుణంగా హత్యకు గురయ్యాడనే వార్త వారిని కలిచివేస్తోంది. అయితే తమ అన్న శ్రీనివాసులును చంపింది కోట వినుత దంపతులేనని శ్రీనివాసులు సోదరి కీర్తి ఆరోపించారు. కోట వినుత వద్ద 15 ఏళ్ల నుంచి తన అన్న పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు.
” వినుత వాళ్ల దగ్గర 15 నుంచి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు, వాళ్ల దగ్గరే నమ్మకంగా ఉంటూ వస్తున్నాడు. ఈ మధ్యన కిందపడి కాలికి దెబ్బ తగిలిందని ఫోన్ చేస్తే చూడ్డానికి వెళ్లాం. ఏం జరిగిందని అడిగితే వాళ్ల మనుషులు మా అన్నయ్యను మాట్లాడనివ్వలేదు. చుట్టూ కూర్చున్నారు. మాకు ఏమీ చెప్పనియ్యలేదు. జూన్ 21వ తేదీ ఇంట్లో నుంచి పంపిచేశామని చెప్పారు, కానీ వాళ్లే ఇదంతా చేశారు. వాళ్ల దగ్గరే పెట్టుకుని చివరకు చంపేశారు. మేము వెళ్లినప్పుడు ఎవరైతే ఐదు మంది ఉన్నారో.. ఇప్పుడు కూడా వాళ్లే చంపినట్లు బయటపడ్డారు. దీన్ని ఇంతటితో వదలం. మాకు న్యాయం జరగాలి.” అని కీర్తి డిమాండ్ చేశారు.
“జనసేన పార్టీనే నమ్ముకుని ఉన్నాం. ఆ పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయాలి. లేకపోతే ఇంకో పార్టీ తరుఫున పోరాడుతాం. ఇంతటితో వదిలిపెట్టం. వారిని నాలుగు రోజులు జైళ్లో వేసి వదిలేస్తామంటే ఒప్పుకునేది లేదు. అలా చేస్తే మరొకరికి ఇలా జరిగే అవకాశం ఉంది. వాళ్లు బయటకు వస్తే మమ్మల్ని ఏదో ఒకటి చేస్తారు. కూలీనాలీ చేసుకుని బతికేటోళ్లం. మమ్మల్ని కూడా చంపేస్తామని బెదిరించారు. మా అమ్మమ్మకు డబ్బులిస్తాం ఏమీ చెప్పొద్దని అడిగారు. డబ్బులతో కొనాలని చూశారు కానీ మేం లొంగలేదు. మాకు న్యాయం కావాలి. ఎంత తప్పుచేసినా చంపే హక్కు వారికి లేదు” అని శ్రీనివాసులు సోదరి కీర్తి కోరారు.