ఇంతకు పిల్లాడు స్కూల్‌కు వెళ్తున్నాడంటే.. ఎలా చదువుతున్నాడు మీవోడు అని అడిగేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చదువు సంగతి దేవుడెరుగు.. స్కూల్‌కు వెళ్లే పిల్లాడి తల్లిదండ్రులను ఎవరైనా ముందు అడిగే ప్రశ్న.. ఫీజు ఎంత అని అడుగుతున్నారు. చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు గతంలో పెద్ద రోగాలు, అనారోగ్య సమస్యలు వస్తే భయపడేవారు. ఆస్పత్రి ఖర్చులకు. కానీ, ఇప్పుడు పిల్లలను స్కూల్‌లో చేర్పించాలనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే.. నర్సరీ, ఎల్‌కేజీ పిల్లాడికి ఎన్ని వేలు, లక్షలు అడుగుతారో అనే భయం. ప్రస్తుత కాలం ఎడ్యుకేషన్ ఒక పక్కా కమర్షియల్ బిజినెస్ అయిపోయింది. భారీగా పెరిగిపోతున్న స్కూల్ ఫీజులు మధ్యతరగతి కుటుంబాలపై పెను భారంగా మారుతున్నాయి.
కొంతమంది మధ్యతరగతి వాళ్లు ఏకంగా పిల్లల ఎల్‌కేజీ ఫీజు కోసం ఏకంగా బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారు. వాటికి ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం వినేందుకు విచిత్రంగా ఉన్నా.. చాలా భయంకరమైన పరిస్థితి వచ్చేసిందనే అంశాన్ని గమనించాలి. స్కూల్ ఫీజు కట్టేందుకు లోన్లు తీసుకోవడం, వాటికి ఈఐఎంలు కట్టే.. పరిస్థితి వచ్చేసిందంటే భవిష్యత్తు మరింత డేంజర్‌గా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పైగా ఈ విషయం గురించి ఆందోళన వ్యక్తం చేసింది ఎవరో కాదు.. ప్రముఖ క్రిప్టోకరెన్సీ యాప్ కాయిన్‌స్విచ్ సహ వ్యవస్థాపకుడు ఆశిష్ సింఘాల్. భారతదేశంలోని స్కూల్ ఫీజులపై స్పందిస్తూ.. “30% ఫీజు పెంపు. ఇది దొంగతనం కాకపోతే, ఏమిటి?” అని ఆయన ప్రశ్నించారు.
తన కుమార్తె కోసం పాఠశాలలను పరిశీలిస్తున్నప్పుడు సింఘాల్ తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నాడు. బెంగళూరులో చాలా మంది తల్లిదండ్రులు 3వ తరగతికి సంవత్సరానికి దాదాపు రూ.2.1 లక్షలు చెల్లిస్తున్నారని తెలుసుకుని సింఘాల్ ఆశ్చర్యపోయారు. భారతదేశంలోని మొత్తం కుటుంబ ఆదాయంలో విద్య ఖర్చులు ఇప్పుడు 19 శాతం ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అంటే ఓ వ్యక్తి నెలకు 10 వేలు సంపాదిస్తే.. అందులో 1900 తీసి పక్కనపెట్టాల్సిందే. అధికారిక డేటా ప్రకారం విద్యా ద్రవ్యోల్బణం దాదాపు 4 శాతం ఉందని, కానీ తల్లిదండ్రులు తమ జేబులపై దాని ప్రభావాన్ని ఎక్కువగా చూస్తున్నారని సింఘాల్ తెలిపారు. మధ్యతరగతి కుటుంబాల ఆదాయాలు గత దశాబ్దం కాలంలో సంవత్సరానికి 0.4 శాతం మాత్రమే పెరిగాయి. కానీ, స్కూల్ ఫీజులు ఏకంగా 30, 40 శాతం పెరిగాయి.. దీని ఫలితంగా ఆయా కుటుంబాలు ఇప్పుడు నర్సరీ లేదా ప్రాథమిక పాఠశాల ఫీజులు చెల్లించడానికి EMIలు తీసుకుంటున్నాయి. భవిష్యత్తులో పై చదువుల అంటే కాలేజీ కోసం పొదుపు చేయడం అటుంచితే.. ఇప్పుడు కేవలం ఎల్‌కేజీ, యూకేజీకే తల్లిదండ్రులు అప్పు చేస్తున్నారు అని సింఘాల్ ఆందోళన వ్యక్తం చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి