
దేశంలో రోజురోజుకూ అవినీతి పెరిగిపోతుంది. అక్రమసంపాదనకు అలవాటు పడిన కొందరు వ్యక్తులు అవినీతికి పాల్పడి దొరికినప్పుడు.. తప్పించుకునేందుకు అమాయకులను ఇరికించడం మనం సాధారణంగా చూస్తుంటాం.. కానీ ఇక్కడ కొందరు వ్యాపారులు తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఏకంగా నోరులేని, తమపై తిరిగి కేసు పెట్టలేని ఎలుకలపై తీవ్ర ఆరోపణలను మోపారు. తమ షాప్‌లో ఉన్న ఎలుకలు ఏకంగా 800 బాటిల్ల విదేశీ మద్యాన్ని తాగేశాయని అధికారులకు వివరించారు. ఇది విని ఆశ్చర్యపోయిన అధికారులు నష్టపోయిన మద్యం తాలుక పరిహారం చెల్లించాలని వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే.. గత ఏడాది సెప్టెంబర్ నెల నుంచి జార్ఖండ్‌లో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఈ విధానాన్ని అమలు చేయడానికి ముందు, రాష్ట్ర యంత్రాంగం రాష్ట్రంలోని మద్యం నిల్వలను పరిశీలించింది. ఈ డ్రైవ్‌లో భాగంగా ఎక్సైజ్ అధికారులు ధన్‌బాద్‌లోని బలియాపూర్‌లో ఉన్న దుకాణాలను తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా ఓ షాప్‌లో 802 IMFL( ఇండియన్ మేడ్ ఫారెన్ విక్కీ) ఖాళీ బాటిళ్లను గుర్తించారు. వీటి గురించి అధికారులను నిలదీసినప్పుడు వారు ఓ వింతైన సాకును అధికారులు తెలిపారు. ఎలుకలు బాటిల్ మూతలను నమిలేసి వాటిలోని మద్యాన్ని తాగేశాయని వారు ఆరోపించారు. ఇది విన్న అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఆ తర్వాత మద్యం నిల్వల కొరతను సమర్థించుకోవడానికి వారు ఎలుకలపై నిందలు వేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో అక్రమంగా అమ్ముకున్న మద్యం తాలుక పరిహారం ప్రభుత్వానికి చెల్లించాలని సదురు వ్యాపారులకు నోటీసులు జారీ చేయనున్నట్టు అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ రాంలీలా రవణి తెలిపారు. మద్యం నిల్వలు తగ్గిపోవడానికి ఎలుకలను నిందిస్తున్న వ్యాపారుల గురించి అడిగినప్పుడు, ఆయన “నాన్సెన్స్” అని బదులిచ్చారు.
అయితే ఈ ప్రాంతంలో ఇలా మద్యం, మత్తు పదార్థాల దొంగతనాలకు ఎలుకలను నిందించడం ఇదే మొదటి సారి కాదట.. ఇంతకు ముందు ఇలాంటి ఘటనలు జరిగాయట.. గతంలో డ్రగ్స్ పెడ్లర్ల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సుమారు 10 కిలోల గంజాయిలో, 9 కిలోల ఎలుకలు తిన్నట్టు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఈ విషయం కోర్టు వరకు వెళ్లింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.