బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం ద్వారా రూ.13000 జమ చేసింది. అయితే శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఒక మహిళ తన కుమారుడికి వచ్చిన డబ్బును, మరో రెండు వేలు కలిపి పాఠశాల అభివృద్ధికి విరాళంగా ఇచ్చింది. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు చాలని, ఈ డబ్బును పాఠశాల అభివృద్ధికి వినియోగించాలని ఆమె కోరారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు.

“పిల్లల చదువుకు తల్లిదండ్రుల్లా ఆలోచిస్తూ కూటమి ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తోందని, తల్లికి వందనం పథకం కింద తన ఖాతాలో పడిన 13 వేలుకి మరో రెండు వేలు కలిపి 15 వేలు పాఠశాల అభివృద్ధికి వినియోగించాలని అందించిన తల్లీ నీకు వందనం. శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం-మత్స్యలేశం ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న కుమారుడికి వచ్చిన తల్లికి వందనం నిధులు అదే పాఠశాల అభివృద్ధికి అందించిన తల్లికి అభినందనలు. విద్యా వ్యవస్థ బలోపేతానికి మేము చేస్తున్న కృషికి మీలాంటి వారి సహకారం తోడు కావడం చాలా సంతోషం.” అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వస్తే.. కళింగపట్నం – మత్స్యలేశం ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మత్స్యలేశం గ్రామానికి చెందిన ఓ మహిళ కుమారుడు.. స్థానికంగా ఉన్న పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. దీంతో తల్లికి వందనం పథకం కింద ఆమె బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం రూ.13000 జమ చేసింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన రూ.13000లతో పాటుగా మరో రూ.2000 కలిపి మొత్తం రూ.15000 స్కూలుకు ఇచ్చేసిందా మహిళ.
ప్రభుత్వం తన కొడుకు చదువుకునేందుకు అన్ని సదుపాయాలు కల్పించిందని.. యూనిఫామ్, బూట్లు, పుస్తకాలు.. మధ్యాహ్నం భోజనం పెడుతున్నారని.. తమకు అవి చాలని ఆ మహిళ చెప్పింది. తల్లికి వందనం డబ్బులు తమకు అవసరం లేదని.. ఈ 15 వేలు స్కూలు అభివృద్ధికి ఉపయోగించండి అంటూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం సందర్భంగా స్కూలు హెడ్మాస్టర్ చేతికి అందజేసింది. దీంతో ఈ విషయం వైరల్ కాగా.. నారా లోకేష్ ఆ మహిళను అభినందించారు.