వర్షాకాలంలో చాలా మందికి సోమరితనం, నిద్రమత్తు పీడిస్తుంటాయి. అబ్బో.. బెడ్ వదిలి ఏ పనీ చేయబుద్ధే అవ్వట్లేదు అనిపిస్తుంటుంది కదా..? కానీ చిన్న చిన్న మార్పులతో మన డైలీ లైఫ్ ని కొద్దిగా చురుగ్గా మార్చుకోవచ్చు. మీ బాడీని, మైండ్ ని ఫ్రెష్ గా ఉంచేందుకు కొన్ని ఈజీ టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వెలుతురును పెంచండి
ఈ మబ్బుల వాతావరణంలో ప్రకాశం తగ్గిపోతుంది. ఇది మీ బ్రెయిన్ ను కన్ఫ్యూజ్ చేసి ఇంకా రాత్రే అనే సిగ్నల్ పంపుతుంది. దీని వల్ల నిద్రలేమికి కారణమయ్యే మెలటోనిన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దీనికి బదులుగా పగలు కిటికీలు తెరిచి ఇంట్లోకి ప్రకాశాన్ని రానివ్వండి. అవసరమైతే పగటిపూట కూడా రూమ్ లైట్స్ వేసుకోండి. వర్షం తగ్గిన తర్వాత బాల్కనీ లేదా ఇంటి పైకి వెళ్లి కాసేపు వెలుతురులో గడపండి. ఇది మీ శరీరంలోని బయోలాజికల్ క్లాక్ ను సెట్ చేస్తుంది.
చిన్నపాటి వ్యాయామం
చలిలో దుప్పటిలో హాయిగా పడుకోవడం కంఫర్ట్ గా అనిపించినా.. అది మీ శరీర చురుకుదనాన్ని తగ్గిస్తుంది. వారం రోజులుగా అలసిన ఫీలింగ్ వస్తుంటే.. ఇంట్లోనే కొన్ని చిన్న వ్యాయామాలు చేసి చూడండి. మెట్లు ఎక్కడం, ఇంటి పనులు చేయడం, లైట్ స్ట్రెచింగ్, యోగా, లేదా ఫోన్ లో మాట్లాడుకుంటూ ఇంట్లో నడవడం కూడా మంచిదే. మీకు ఇష్టమైన పాటకు డాన్స్ చేయండి.. ఇది బాడీని ఉత్సాహంగా ఉంచుతుంది. రోజుకు కనీసం 20 నిమిషాలు కేటాయించండి.
ఫుడ్స్ విషయంలో జాగ్రత్త
వర్షాకాలం అంటే సమోసా, పకోడీ అంటూ నోరు ఊరుతుంది కదా..? కానీ ఇవి జీర్ణానికి భారంగా మారతాయి. దీనికి బదులుగా సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి.. వేపుడు కూరగాయలు, పప్పు, సూప్ లు, పండ్లు, సలాడ్ లు వంటివి. అలాగే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా గోరువెచ్చని నీరు, అల్లం టీ, తులసి టీ వంటి తేలికపాటి డ్రింక్స్ తీసుకోవడం మంచిది. షుగర్ ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్, డెజర్ట్స్‌ని అవాయిడ్ చేయండి.
వాతావరణాన్ని ఫ్రెష్ గా ఉంచండి
వర్షాకాలం కిటికీలు మూసి ఉంచినప్పుడు గది లోపల గాలి ప్రవాహం తగ్గిపోతుంది. ఒక్కోసారి ఇది విసుగును పెంచుతుంది. ఎప్పటికప్పుడు కిటికీలు తెరిచి తాజా గాలిని ఇంట్లోకి రానివ్వండి. సిట్రస్, పుదీనా, రోజ్మేరీ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్‌ను డిఫ్యూజర్‌లో వాడడం ద్వారా మానసిక ఉల్లాసం వస్తుంది. లేదంటే కాటన్‌పై కొన్ని చుక్కలు వేసి పీల్చినా సరిపోతుంది. అవసరమైతే చల్లటి నీటితో ముఖాన్ని, చేతులను కడుక్కోవడం వల్ల తక్షణమే రిఫ్రెష్ అవుతారు.
నిద్ర పరిమితిని నియంత్రించండి
వర్షం పడుతుంటే ఎప్పుడైనా పడుకుని నిద్రపోవాలనిపిస్తుంది. కానీ పగటిపూట ఎక్కువగా నిద్రపోతే.. మీరు మరింత అలసటతో బాధపడతారు. రాత్రి 7 నుంచి 8 గంటల క్వాలిటీ నిద్ర తీసుకుంటే చాలు. మీకు నిద్ర వస్తుంటే 20 నుంచి 30 నిమిషాలు చిన్న నాప్ తీసుకోవచ్చు. అయితే అరగంట కంటే ఎక్కువ నిద్రపోతే.. మీరు గాఢ నిద్రలోకి వెళ్లిపోతారు. దాని వల్ల మేల్కొన్న తర్వాత మరింత బరువుగా అనిపిస్తుంది.
వర్షాకాలం బద్ధకాన్ని తెచ్చినా.. మనసుకు ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది. ఈ చిన్న చిట్కాలను పాటిస్తే.. మీరు సోమరితనాన్ని వదిలించుకొని రోజంతా చురుగ్గా ఉండగలరు. ప్రకాశవంతమైన గది, సరైన ఆహారం, తేలికపాటి వ్యాయామం, స్వచ్ఛమైన వాతావరణం.. ఇవే మీ బద్ధకానికి చెక్ పెట్టే అద్భుతమైన మార్గాలు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..