అస్సాంలోని టిన్సుకియా జిల్లాలో ఒక మహిళ యొక్క ఫోటోలను ఏఐ సహాయంతో అశ్లీల వీడియోలుగా మార్ఫింగ్ చేసి.. వాటిని సోషల్ మీడియాలో ప్రసారం చేసి లాభం పొందాడనే ఆరోపణలపై ఒక వ్యక్తిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. తన అప్రతిష్టను దిగజార్చడానికి మార్ఫింగ్ చేసిన చిత్రాలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రచారం చేస్తున్నాడన్న శనివారం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. నిందితుడు ఒక మెకానిక్ ఇంజనీర్ అయిన ప్రతిమ్ బోరాగా పోలీసులు గుర్తించారు. అయితే నిందితుడికి, బాధితురాలికి ఇదువరకే పరిచయం ఉందని..కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నిందితుడు ఆమెను బదనాం చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులు గుర్తించారు. ఆమె ప్రతిష్ఠను దెబ్బతీయాలని నిర్ణయించుకున్న ప్రతిమ్ బాధితురాలి ఒక ఫొటోను ఉపయోగించి వివిధ AI సాఫ్ట్‌వేర్‌ల ద్వారా అశ్లీల వీడియోలు రూపొందించాడు. అంతేకాకుండా ఆమె పోర్న్ పరిశ్రమలో చేరినట్లు కంటెంట్ క్రియేట్ చేశాడు. వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు.
మొదట్లో కేవలం ఆమెను ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే వీటిని వినియోగించిన నిందితుడు.. తర్వాత ఈ AI- జనరేటెడ్ అశ్లీల చిత్రాలను పలు సోషల్ మీడియా పేజీలకు అందించేందుకు సబ్‌స్క్రిప్షన్ పేరుతో డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేశాడు. ఇలా పలు పేజీలకు ఈ వీడియోలను అందించడం ద్వారా అతను సుమారు రూ.10లక్షలు సంపాదించినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు అతడి నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఒక హార్డ్ డిస్క్, ఒక ల్యాప్‌టాప్, ఒక టాబ్లెట్, ఒక పెన్‌డ్రైవ్, అనేక సిమ్‌కార్డులు సహా అనేక ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
మరోవైపు ఈ కేసుపై పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఆన్‌లైన్ కంటెంట్‌ను యాక్సెస్ చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో అందే ఏదైనా సమాచారాన్ని ప్రసారం చేసే ముందు ఆది నిజమా, కాదా అనేది క్షుణ్నంగా పరిశీలించాలని కోరారు. సదురు మహిళ పేరుతో ప్రసారం అవుతున్న వీడియోలు మార్ఫింగ్ చేసినవని మొదట ప్రజలకు తెలియకపోవచ్చని.. కానీ ఇప్పుడు ఈ మార్ఫింగ్ వీడియోలను ఎవరూ ప్రసారం చేయడం చేయవద్దని తెలిపారు. అంతే కాకుండా బాధిత మహిళ టార్గెట్‌గా ఎలాంటి పోస్ట్‌లు, వ్యాఖ్యలు చేయొద్దని కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.