అమరావతి రాజధాని నిర్మాణం.. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సింగపూర్‌కు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈనెల 26 నుంచి 30 వరకు సింగపూర్‌లో పర్యటించనుంది చంద్రబాబు బృందం. సింగపూర్‌లోని రాజకీయ, వ్యాపార వర్గాలతో సమావేశం కానుంది. నగరాల ప్రణాళిక, నగర సుందరీకరణ, ఉద్యానవనాలు, ఓడరేవులు, మౌలిక వసతుల కల్పనపై చర్చలు జరపనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు నారాయణ, నారా లోకేశ్, టీజీ భరత్, అధికారులు సింగపూర్ వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని సింగపూర్ ప్రభుత్వాన్ని కోరనున్నారు.
2014లో అమరావతిని రాజధానిగా ప్రకటించాక.. క్యాపిటల్ సిటీ నిర్మాణం కోసం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం.. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేసింది. 2024లో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందుకోసమే చంద్రబాబు ఈనెల 26న సింగపూర్ వెళ్లనున్నారు. ఐదు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనున్నారు. అక్కడి ప్రభుత్వంతో, అధికారులతో చర్చలు జరిపి ఈనెల 30న ఏపీకి తిరిగిరానున్నారు చంద్రబాబు.