చారిత్రక బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒన్ డిస్ట్రిక్ట్ ఒన్ ప్రొడక్ట్ పథకం కింద బొబ్బిలి వీణ ఎంపిక అయ్యింది. ఈ అవార్డును విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జులై 15న ఢిల్లీలోని ప్రగతి మైదానం భారత్ మండపంలో జరిగే కార్యక్రమంలో అందుకోనున్నారు.
బొబ్బిలి వీణ సరస్వతి వీణగా ప్రసిద్ధి గాంచింది. ఈ సంగీత వాద్యాన్ని దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ గౌరవంగా చూస్తారు. వీణ నిర్మాణంలో ఉపయోగించే పనస మరియు సంపంగి చెక్కలతో తయారుచేయడం ఈ వీణ యొక్క ప్రత్యేకత. ఇక్కడ తయారయ్యే గిఫ్ట్ వీణలు కూడా విశేషంగా ఆదరణ పొందుతున్నాయి. వీటిని జ్ఞాపికలుగా ప్రసిద్ధ వ్యక్తులకు బహూకరించడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. బొబ్బిలి వీణ ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక గౌరవాలను సంపాదించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ వీణను చూసి అభినందించగా, జి-20 సదస్సు, విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ వంటి ముఖ్యమైన కార్యక్రమాల్లో వీణ ప్రదర్శనలు ప్రపంచానికి పరిచయం అయ్యాయి. బొబ్బిలి వీణ చిత్రంతో పోస్టల్ స్టాంపులు, నాణేలు కూడా ముద్రించబడ్డాయి. వీణలు ఇతర రాష్ట్రాలకు, దేశాలకు కూడా ఎగుమతి అవుతుండటంతో ఈ హస్తకళకు మంచి మార్కెట్ ఏర్పడింది.
వీణ తయారీ ప్రధానంగా బొబ్బిలి పట్టణానికి సమీపంలోని గొల్లపల్లి గ్రామంలో జరుగుతుంది. ఈ గ్రామంలోని దాదాపు పలు కుటుంబాలు బొబ్బిలి రాజుల కాలం నుంచి వీణ తయారీలో నిమగ్నమై జీవనం కొనసాగిస్తున్నాయి. గతంలో వీణ తయారీకి వినియోగించే పనస కలప కొరత ఏర్పడిన నేపథ్యంలో కలప కొరతను అధిగమించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనస చెట్ల సాగును పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇది ఈ కళను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. ఓడీఓపీ కింద లభించిన ప్రస్తుత గుర్తింపు బొబ్బిలి వీణ ఖ్యాతిని దేశవ్యాప్తంగా మరింతగా పెంచనుంది. సంస్కృతి, సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉన్న బొబ్బిలి వీణ, భారతీయ కళా సంపదకు గొప్ప ప్రతీకగా నిలుస్తోంది. ఇప్పుడు ఓడీఓపీ అవార్డు రూపంలో వచ్చిన ఈ గౌరవం, ఈ కళను భవిష్యత్ తరాలకి మరింత చేరువ చేయనుంది.