ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలకు వేదికగా మారుతోంది. ప్రఖ్యాత విద్యాసంస్థ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) తన క్యాంపస్‌ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అమరావతిలో బిట్స్ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా ప్రకటించారు. రూ.2వేల కోట్ల పెట్టుబడితో, డిజిటల్ ఫస్ట్ ఆపరేషన్స్‌తో, ఏఐ, ఐఓటి ఇంటిగ్రేట్ క్యాంపస్‌ను నిర్మిస్తున్నట్టు తెలిపారు. 7000 మంది విద్యార్ధులు చదువుకునే విధంగా ఈ క్యాంపస్ నిర్మిస్తామని ఆయన అన్నారు.
7,000 మంది విద్యార్థులకు చదువుకునేలా క్యాంపస్..
ఈ AI+ క్యాంపస్‌ను 7,000 మంది విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా నిర్మించబోతున్నట్టు ఆయన తెలిపారు. ఇది తెలుగురాష్ట్రాల్లో అత్యున్నత విద్యకు మార్గదర్శకంగా మారుతుందని ఆయన అన్నారు. అమరావతిలో ఇలాంటి శాస్త్రీయ, సాంకేతిక విద్యా సంస్థల ఏర్పాటు రాష్ట్ర విద్యారంగ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి ప్రపంచ స్థాయి అవకాశాలను కల్పించడమే ఈ క్యాంపస్ లక్ష్యమని ఆయన తెలిపారు.
అయితే రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్న ఈ బిట్స్ విశ్వవిద్యాలయానికి ఇప్పటికే హైదరాబాద్, గోవా దుబాయ్‌లో పలు క్యాంపస్‌లు ఉండగా తాజాగా అమరావతిలోనూ బిట్స్ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు బిర్లా ఛైర్మన్ కుమార మంగళం బిర్లా ప్రకటించారు. అయితే అమరావతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను నిర్మించేందుకు బిట్స్ ప్రతినిధులు కసరత్తు చేస్తున్నారు.ఈ అంశంపై ఇప్పటికే బిట్స్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంలో చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది.
వెంకటపాలెంలోని బైపాస్ వద్ద క్యాంసర్ ఏర్పాటుకు స్థలాన్ని కూడా చూశారు. అయితే గతంలో ఇక్కడ స్థలాన్ని పరిశీలించిన బిట్స్ ప్రతినిధులు అమరావతిలో తమ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు ఉన్న అనుకూలతలను వారి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీనిపై తమ ప్రతినిధులతో చర్చించిన ఛైర్మన్ కుమార మంగళం బిర్లా తాజాగా అమరావతిలో బిట్స్ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.