Madhya Pradesh’s Mysterious Temple: 3 Days of Darshan in a Yearసాధారణంగా శివాలయం భక్తుల దర్శనార్ధం రోజూ తెరిచే ఉంటుంది. భక్తులు మహాశివుడిని, శివలింగాన్ని పూజిస్తుంటారు. తమకు ఎప్పుడు వెళ్లాలనిపిస్తే అప్పుడు శివుడిదగ్గరకు వెళ్లి పూజలను చేస్తారు. అయితే మధ్యప్రదేశ్‌లోని ఓ శివాలయంలో మాత్రం అలా కుదరదు. ఏడాదికి మూడో రోజులు మాత్రమే స్వామివారి దర్శనభాగ్యం లభిస్తుంది. అసలు ఆ ఆలయం రాష్ట్రంలో ఎక్కడుంది? ఎందుకు శివుడు మూడు రోజులే భక్తులకు దర్శనం ఇస్తాడు తెలుసుకుందాం..
బుందేల్‌ఖండ్ ప్రాంతంలో చందేల్ కాలం హస్తకళలకు ప్రసిద్దిగాంచినది. నేటికీ ఈ ప్రాంతంలో చేతిపనులు, శిల్పకళల గొప్పదనాన్ని తెలియజేసే విధంగా ఎన్నో సజీవసాక్ష్యాలున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఖజురాహో ఆలయంతో పాటు, మాల్థోన్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లో రెహ్లి సూర్య దేవాలయం, పాలిలోని హజారియా శివాలయ నిర్మాణంతో భక్తులను, పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు హజారియా ఆలయం’ చందేల్ కాలంలోని కళా నైపుణ్యానికి చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది. ఈ ఆలయాన్ని పదో శతాబ్దంలో నిర్మించారు.
అక్కడ శివుడిని ‘హజారియా మహాదేవుడు’ అని పిలుస్తారు. అక్కడ ఉన్న శివలింగాన్ని పూజిస్తే వెయ్యికి పైగా లింగాలను పూజించిన పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. అయితే ఈ ఆలయాన్ని భక్తులు ఏడాదికి కేవలం మూడు సార్లు మాత్రమే సందర్శించగలరు. ఎందుకంటే ఆ ఆలయం చారిత్రక ప్రాముఖ్యం కారణంగా పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. కనుక ఈ ఆలయానికి ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది. శివరాత్రి, శ్రావణ సోమవారం, కార్తీక పూర్ణిమ రోజుల్లో మాత్రమే ఈ శివాలయాన్ని భక్తుల దర్శనం కోసం తెరుస్తారు.
‘హజారియా మహాదేవుడు
మాల్థోన్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని పాలి గ్రామ సమీపంలో నిర్మించిన ఈ శివాలయం.. చందేల్ కాలం నాటి చేతిపనులు, శిల్పకళకు సాటిలేని ఉదాహరణగా నిలుస్తుందని పురావస్తు విభాగ అధిపతి డాక్టర్ నగేశ్ దూబే చెప్పారు. అంతేకాదు ఈ ఆలయానికి సంబంధించిన అనేక ముఖ్య విషయాలను గురించి చెబుతూ ఈ ఆలయం పాలి గ్రామానికి నైరుతి దిక్కులో జాతీయ రహదారి 44 సమీపాన ఉన్న అడవిలో ఓ కొండపై ఉంది. ఈ ఆలయ గర్భగుడిలో శివలింగం ఉంది. ఆలయ ప్రవేశ ద్వారం మధ్యలో త్రిభంగ భంగిమలో శివపార్వతి శిల్పాలను చెక్కి ఉంచారు. చందేల్ కాలం నాటి ఈ ఆలయాన్ని స్థానిక ప్రజలు ‘హజారియా మహాదేవ’ ఆలయం అని పిలుస్తారు. ఇప్పటికే ఈ ఆలయంలో కొంత భాగం శిథిలావస్థలో ఉంది. ఆలయంలో గర్భగుడితో పాటు వెలుపల నంది విగ్రహం ఉంది. ఆలయం చుట్టూ విరిగిపోయిన విగ్రహాలు ఉన్నాయి. వాటిలో దేవతల, అప్సరసల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆలయ గర్భగుడిలో ప్రతిష్టించిన శివలింగంలో 1008 శివలింగాలు ఉన్నాయి. అందువల్ల ఈ ఆలయాన్ని హజారియా మహాదేవ ఆలయం అని పిలుస్తారు” అని అన్నారు. కేవలం మూడు సార్లు మాత్రమే సందర్శించే అవకాశం ఉన్నందున భక్తులు భారీ సంఖ్యలో దర్శనం కోసం ఈ సమయంలో ఇక్కడికి చేరుకుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.