పుష్ప సినిమా చూసి తెలివికి పదునుపెడుతున్నారో.. లేక పుష్పకు గురువులో గానీ.. పోలీసులకు దొరక్కుండా యదేచ్చగా తమ అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. గంజాయి నుంచి ఎర్రచందనం వరకు.. డ్రగ్స్ నుంచి కలప వరకు అన్నింటినీ రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. అలాంటి ఓ ఘటన తాజాగా ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా.. ములుగు జిల్లాలో పుష్ప సినిమాను తలపించే తరహాలో కలప స్మగ్లింగ్ రియల్ సీన్ జరిగింది. అర్ధరాత్రి ఛేజింగ్ చేసి కలప వాహనాన్ని పట్టుకున్నారు స్థానిక యువకులు. అనుమానం రాకుండా ట్రాలీ వాహనంలో టేకుదుంగలపైన ఉనుక బస్తాలతో కలప దందా సాగించారు దుండగులు.
అయితే ఆ వాహనాన్ని వెంటాడి వాజేడు మండల గణపురం గ్రామ శివారు దగ్గర చాకచక్యంగా పట్టుకున్నారు యువకులు. బొలెరో ట్రాలీ వాహనంలో తరలిస్తున్న 8 టేకు దుంగలను పట్టుకొని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. అనంతరం వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించారు. ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కొత్తపెళ్లి అడవి ప్రాంతం నుంచి వెంకటాపురం మీదుగా కలప స్మగ్లింగ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కాగా, సదరు వాహనం డ్రైవర్ పరారీలో ఉండగా.. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి