నిమిషా విడుదలపై చర్చించడానికి యెమెన్‌లో ప్రముఖ సూఫీ పండితుడు షేక్ హబీబ్ ఉమర్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో యెమెన్ ప్రభుత్వ ప్రతినిధులు, కోర్టు సుప్రీం జడ్జి, మరణించిన తలాల్ సోదరుడు పాల్గొంటారు. నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అభ్యర్థన మేరకు కాంతపురం AP అబూబకర్ ముస్లియార్ జోక్యం చేసుకుని షేక్ హబీబ్ ఉమర్ ద్వారా యెమెన్‌లోని ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలకు మార్గం సుగమమైంది. ఈ చర్చల్లో బాధిత కుటుంబాన్ని క్షమాభిక్ష కోరనున్నారు. లేదంటే కనీసం మరణశిక్షను తగ్గించేందుకైనా సంప్రదింపులు జరపాలని భావిస్తున్నారు. ఇదంతా బ్లడ్ మనీకి ఆ కుటుంబం అంగీకరిస్తేనే జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు బాధిత కుటుంబ, హుతీ అడ్మిన్ నుంచి సానుకూల స్పందన రాలేదు.
కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన నర్సు నిమిషా ప్రియ (37).. యెమెన్‌లోని తన వ్యాపార భాగస్వామిని హత్య చేసినందుకు 2017 నుంచి యెమెన్ జైలులోనే ఉంది. ఆమెకు మరణశిక్ష విధించబడినప్పటికీ బాధితురాలి కుటుంబానికి పరిహారంగా ఇచ్చే బ్లడ్ మనీ ద్వారా క్షమాభిక్ష పొందే అవకాశం ఉంది. కానీ ఇందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ కోర్ కమిటీ సభ్యుడు దినేష్ నాయర్ మాట్లాడుతూ.. ఈ ప్రయత్నాలు ఫలిస్తాయని, నిమిషా ప్రియ విడుదల అవుతుందని మేము ఆశిస్తున్నామన్నారు. యెమెన్ సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, ఈ చొరవ నిమిషా ప్రియ విడుదలను పొందేందుకు ఒక ఆచరణాత్మక విధానంగా భావిస్తున్నట్లు తెలిపారు. మరణించిన యెమెన్ పౌరుల కుటుంబానికి బ్లడ్ మనీ చెల్లించడం ద్వారా నిమిషా ప్రియ ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. నిమిషా ప్రియను కాపాడే ప్రయత్నాలలో ఇప్పటికే రెస్క్యూ ఫండ్‌కు చెప్పుకోదగ్గ స్థాయిలో విరాళాలు అందాయని తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులతో చర్చలు సులభతరం చేయడానికి యెమెన్‌లో చర్చలు చురుకుగా సాగుతున్నట్లు దినేష్ నాయర్ పేర్కొన్నారు. మరోవైపు నిమిషా ప్రియ విడుదలకు సహాయం చేయడానికి లీగల్ ఎయిడ్ కమిటీ ట్రస్ట్ సంసిద్ధతను వ్యక్తం చేసింది. అబ్దుల్ రహీం విడుదల కోసం సేకరించిన మిగిలిన మొత్తాన్ని కూడా నిమిషా ప్రియ కేసుకు అందజేయాలని భావిస్తోంది.
నిమిషా ప్రియను కాపాడటానికి ప్రస్తుత దౌత్యపరమైన పరిమితుల మధ్య తాము చేయగలిగినదంతా చేశానని భారత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. బాధిత కుటుంబంతో బ్లడ్ మనీ చర్చలు జరపడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. కానీ ఆ కుటుంబం మాత్రం దీనిని తమ గౌరవానికి సంబంధించిన పేర్కొంటూ నిరాకరించిందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు బాధిత కుటుంబానికి పరిహారంగా రూ. 8.6 కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడగా.. ఆ కుటుంబం మాత్రం ఇంతవరకు ఈ ఆఫర్‌ను అంగీకరించలేదు. ఒకవేళ ఈ మొత్తం పెరిగితే వారి అభిప్రాయం మారుతుందో లేదో తెలియదని ఆయన అన్నారు. బాధిత కుటుంబం బ్లడ్ మనీని అంగీకరించడం, నిమిషాకు ఉపశమనం కలిగించండంపై తుది నిర్ణయానికి రావడమే లక్ష్యంగా ఈ చర్చలు ఉంటాయని ఆయన కోర్టుకు తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.