నాటు కోళ్లపై దొంగలు కన్ను పడింది. మార్కెట్లో నాటు కోళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో.. వీటి ధర రోజురోజుకు పెరుగుతుంది. ఇదే అదునుగా భావించిన కొందరు కేటుగాళ్లు నాటు కోళ్ల ఫాములపై దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగలించిన నాటుకోళ్లను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని అనంతారం గ్రామ సమీపంలో నారా అన్వేశ్‌కు చెందిన కోళ్ల షెడ్‌లో దొంగలు పడి సుమారు 70 వేలు విలువచేసే కోళ్లను ఎత్తుకెళ్లారు. అదేవిధంగా మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ సమీపంలో మోదుగు ప్రభాకర్‌కు చెందిన కోళ్ల షెడ్‌లో ఓ గుర్తు తెలియని యువకుడు కోళ్లను దొంగలించేందుకు విఫలయత్నం చేశాడు. షెడ్డుకున్న జాలిని తొలగించి, లోపలకు ప్రవేశించి కోళ్లను ఎత్తుకెళ్లే క్రమంలో షెడ్‌లో అమర్చిన సీసీకెమెరా సైరన్ మోగడంతో పరారయ్యాడు.
ఈ రెండు సంఘటనలకు సంబంధించి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇళ్లలోని కోళ్లను సైతం కొందరు కేటుగాళ్లు అపహరిస్తున్నారు. మార్కెట్లో కిలో నాటుకోడి ధర 500 పైగా ఉండడంతో మాంసం ప్రియులు సైతం నాటుకోడి మాంసం తినేందుకు మక్కువ చూడటంతో, ఈజీ మనీ అలవాటు పడిన కొందరు నాటు కోళ్ల దొంగతనానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దొంగల బెడద నుంచి నాటు కోళ్లును కాపాడాలని యజమానులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..