విజయనగరం జిల్లా బొబ్బిలి ఓ ప్రైవేట్ పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం ఓ విద్యార్థి మృతికి దారి తీసింది. రావువారి వీధికి చెందిన సుందరాడ సంతోష్, విజయల కుమారుడు కార్తికేయ.. అభ్యుదయ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అలాగే.. అదే ప్రాంతానికి చెందిన మరో విద్యార్థి కూడా అదే స్కూల్ లో చదువుతున్నాడు. కార్తికేయ మరో విద్యార్థి తరచూ చిన్న చిన్న వాగ్వాదాలకు దిగుతుంటారు. ఈ క్రమంలోనే స్కూల్ వద్ద క్రికెట్ ఆడుతుండగా కార్తికేయకు, మరో విద్యార్థికి మధ్య వివాదం తలెత్తింది. ఆ వివాదం రెండు రోజుల పాటు సాగింది. స్కూల్ లో ఒకరికి ఒకరు మాటలతో అవమానించుకోవడం ప్రారంభించారు.
ఈ నేపథ్యంలోనే స్కూల్ లో మరోసారి ఘర్షణ పడ్డారు. నీకు దమ్ముంటే సాయంత్రం స్కూల్ వదిలేసిన తరువాత రాజా గారి కోట ప్రాంగణంలోకి రా నీ సంగతి తెలుస్తా అని కార్తికేయకు మరో విద్యార్థి సవాల్ విసిరాడు. దీంతో ఆ విద్యార్థి సవాలు స్వీకరించిన కార్తికేయ పాఠశాల పూర్తయ్యాక రాజుల కోటకు వెళ్లాడు. అక్కడ ఇద్దరూ ఎదురుపడ్డారు. చిన్నపాటి వాగ్వాదం తీవ్ర ఘర్షణగా మారింది. కోపంతో తోటి విద్యార్థి కార్తికేయ పై పిడిగుద్దులుతో దాడి చేశాడు. కార్తికేయ తల భాగంలో బలంగా గుద్దడంతో కార్తికేయ స్పృహతప్పి కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్నవారు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల మధ్య ఏర్పడుతున్న చిన్న చిన్న వాగ్వాదాలు చివరికి భౌతిక దాడులకు దారితీస్తున్నాయి. పిల్లల మానసిక స్థితిపై తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం దృష్టి పెట్టి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశం తలెత్తుతాయని అంటున్నారు మానసిక వైద్యులు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..