వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న కోపం హత్యలకు దారితీస్తున్నాయి. ఇలా కుటుంబాలు చిన్నాభిన్నం అవ్వడంతోపాటు.. బాధితుల బిడ్డలు అనాధలుగా మారుతుండడం అందరిని కలవరపెడుతోంది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య.. ప్రియుడు, తమ్ముడితో కలిసి భర్తను హత్య చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసింది. పోలీసులు రంగంలోకి దిగడంతో భార్య చివరికి కటకటాల పాలైంది. యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తువుల స్వామి(38)కి మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన స్వాతితో 2005లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పల్లెర్లలోనే ఉంటూ భువనగిరి పట్టణంలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్ గా స్వామి పనిచేస్తున్నాడు. భార్య స్వాతి కూడా ఇదే షో రూమ్ లో పని చేస్తోంది. ఇదే సమయంలో యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ కు చెందిన సాయికుమార్ తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి చేసింది. ఈ వివాహేతర సంబంధం కాపురంలో చిచ్చు పెట్టింది. కొద్దిరోజులుగా కుటుంబంలో గొడవలు కూడా జరుగుతున్నాయి. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు భార్య స్వాతి పథకం వేసింది.
పల్లెర్లకు చెందిన ఫ్రెండ్ వీరబాబుతో కలిసి స్వామి భువనగిరికి వెళ్ళాడు. ఇద్దరూ బైక్ పై అర్ధరాత్రి స్వగ్రామానికి బయలుదేరారు. మోట కొండూరు మండలం కాటేపల్లి సమీపంలోని బ్రిడ్జి దాటగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది. కారు.. బైక్ ను 50 మీటర్ల దూరం ఈడ్చుకువెళ్లింది. దీంతో అక్కడికక్కడే స్వామి మృతిచెందగా, బైక్ పై వెనక కూర్చున్న వీరబాబు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన వీరబాబును మెరుగైన చికిత్స కోసం పోలీసులు హైదరాబాద్ కు తరలించారు. తొలిత పోలీసులు కూడా రోడ్డు ప్రమాదంగానే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.
ఈ ప్రమాదంపై తమకు అనుమానం ఉందని, భార్య స్వాతి తరుపువారే హత్య చేసి ఉంటారని స్వామి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు స్వామి భార్య స్వాతి, బావమరిది మహేష్ లను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. భర్త స్వామిని అడ్డు తొలగించుకునేందుకు తమ్ముడు మహేష్, తనతో సన్నిహితంగా ఉండే సాయికుమార్ తో కలిసి స్వాతి ప్లాన్ వేసింది. వీరబాబుతో వెళ్లిన తన భర్త స్వామి లొకేషన్ ను మొబైల్ ద్వారా స్వాతి ట్రాక్ చేసింది. భువనగిరి నుండి పల్లెర్లకు వస్తున్న విషయాన్ని సాయి కుమార్ కు స్వాతి చెప్పింది. భువనగిరిలో ఓ కారు అద్దెకు తీసుకొని స్వాతి తమ్ముడు మహేష్ తో పాటు మరో స్నేహితుడు కలిసి సాయికుమార్ బయలుదేరారు. మోట కొండూరు మండలం కాటేపల్లి వద్ద స్వామి బైక్ ను కారుతో స్వామి బలంగా ఢీకొట్టాడు. అనంతరం అక్కడే ఉన్న మామిడి తోటలో కారును వదిలేసి పరారయ్యారు. స్వామి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. రోడ్డు ప్రమాదంలో స్వామి చనిపోయాడనే వార్తను పల్లెల్లోని కుటుంబ సభ్యులకు తెలిసి లబోదిబో మన్నారు. తన భర్త తనకు అన్యాయం చేశాడంటూ ఏమీ తెలియనట్లుగా స్వాతి నటించింది.
స్వామి బాబాయి అయిలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు స్వాతి కాల్ డేటాతో బండారం బట్టబయలైంది. ఈ ఘటనలో స్వాతి, మహేష్, సాయికుమార్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..