డెహ్రడూన్, జులై 15: దేవభూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్ పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ‘ఆపరేషన్ కాలనేమి’ చేపట్టింది. 4వ రోజు ఆయా జిల్లాల్లో 29 మంది ఫేక్ బాబాలను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో 20 మంది బయటి రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు. వికాస్‌నగర్‌లో అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి ప్రార్థనల పేరుతో ప్రజలను మోసం చేస్తూ పట్టుబడ్డాడు. సహస్‌పూర్‌లో దీర్ఘాయుష్షు ఇస్తానంటూ స్వయం ప్రకటిత చౌడీ బాబా చుట్టూ జనం గుమిగూడారు. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి.. సదరు బాబా పలాయనం చిత్తగించారు. కానీ పోలీసులు పట్టుకుని జైల్లో వేశారు. సాహస్‌పూర్‌లో విదేశీయుల చట్టం కింద బంగ్లాదేశ్ పౌరుడు రుక్న్ రకమ్ అలియాస్ షా ఆలం అరెస్టు చేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అతని జాతీయతను ధృవీకరించి, తిరిగి బంగ్లాదేశ్‌కు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మరోవైపు డెహ్రాడూన్ ఎస్ఎస్పీ అజయ్ సింగ్ అన్ని పోలీస్ స్టేషన్లకు సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కన్వర్ యాత్ర సమయంలో యాత్రికులు, ఆధ్యాత్మిక వ్యక్తుల జనసమూహంలో నేరస్థులు దాక్కోకుండా తనిఖీ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ ఆపరేషన్ బద్రీనాథ్ ధామ్‌కు సైతం చేరుకుంది. అక్కడ పోలీసులు 600 మంది బాబాల గుర్తింపులను ధృవీకరించారు. బెంగాల్ నుంచి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. తీర్థయాత్ర స్థలం పవిత్రతను కాపాడటానికి కొత్తగా వచ్చిన వారిని ధృవీకరిండానికి స్టేషన్‌కు పిలిపిస్తున్నట్లు బద్రీనాథ్ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి నవనీత్ భండారి తెలిపారు.
ఇలా కేవలం 5 రోజుల వ్యవధిలోనే ఏకంగా వందల సంఖ్యలో పట్టుబడుతుండటంతో షేక్ బాబాల వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో ఆపరేషన్ కాలనేమికి విస్తృత మద్దతు లభిస్తుంది. నెటిసన్లు సీఎం ధామిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఆయనను సనాతన ధర్మం సెంటినెల్, విశ్వాస రక్షకుడు అని పిలిచారు. అమాయక ప్రజలను మతపరమైన దోపిడీ నుంచి కాపాడటానికి ఇలాంటి స్పెషల్ ఆపరేషన్లు దేశంలోని అన్ని రాష్ట్రాలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.