నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలో వివాహేతర సంబంధం హత్యకు దారి తీసింది. ఈ నెల 11వ తేదీన ఇంటి నుంచి అదృశ్యమైన కర్నాటి దామోదర్ గౌడ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇదే గ్రామానికి చెందిన బుసిగారి బిచ్చన్న, ఆయన కుమారుడు కుర్మయ్య, మరో వ్యక్తి దామోదర్ గౌడ్ ను కొట్టి చంపారు. అనంతరం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువలో శవాన్ని పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసుల మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ హత్య కోణం వెలుగులోకి వచ్చింది. కర్నాటి దామోదర్ గౌడ్, ఆయన భార్య నిర్మల కల్వకోల్ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇదే గ్రామానికి చెందిన బుసీగారి వెంకటమ్మ అనే మహిళతో గత కొన్నేళ్లుగా దామోదర్ గౌడ్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వీరి విషయం వెంకటమ్మ భర్త, కుమారుడికి తెలియడంతో అనేక మార్లు ఇద్దరిని హెచ్చరించారు. గ్రామంలో పరువు పోతోందని ఎన్నో సార్లు వారించిన దామోదర్ గౌడ్, వెంకటమ్మ ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఇద్దరిపై నిఘా పెట్టిన తండ్రి, కుమారుడు ఈ బంధాన్ని వదిలించాలని భావించారు.
భార్యతో అతన్ని చూసి ఆక్రోశంతో హత్య..
అయితే ఈ నెల 11వ తేదీన రాత్రి ఇంటివద్ద గదిలో దామోదర్ గౌడ్, వెంకటమ్మ కలిసి ఉండడాన్ని చూసిన భర్త బిచ్చన్న, కొడుకు కుర్మయ్య ఆగ్రహానికి లోనయ్యారు. మరో సమీప బంధువుతో కలిసి ముగ్గురు వెంకటమ్మ, దామోదర్ గౌడ్ పై దాడి చేశారు. ఘటనలో బిచ్చన్న భార్య వెంకటమ్మకు గాయాలు కాగా… దామోదర్ గౌడ్ ను రాయితీ కొట్టి చంపారు. అనంతరం దామోదర్ గౌడ్ మృతదేహాన్ని అతని టూవీలర్ పైనే గ్రామ సమీపంలో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువలో పడేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
అయితే 11వ తేదీ రాత్రి తన భర్త అదృశ్యమైనట్లు రెండు రోజుల తర్వాత దామోదర్ గౌడ్ భార్య నిర్మల పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి భోజనం అనంతరం ఇంటిపైన ఉన్న రూమ్‌లో పడుకుంటానని వెళ్ళాడని భార్య తెలిపింది. ఉదయం కిందకు రాకపోవడంతో వెళ్ళి చూడగా తలుపులు తెరుచుకుని ఉన్నాయని ఎంత వెతికిన ఆచూకీ లభించలేదని ఫిర్యాదులో పేర్కొంది. ఇక పోలీసుల మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా దామోదర్ గౌడ్ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. సాంకేతిక ఆధారాల పరిశీలన తర్వాత అనుమానితులను విచారించగా అసలు నిజం బహిర్గతం అయ్యింది.
ఇక దామోదర్ గౌడ్ మృతదేహం సింగోటం శ్రీవారి సముద్రం జలాశయంలో లభ్యమైంది. హత్య చేసిన వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మిస్సింగ్ కేసును కాస్త అనుమానాస్పద మృతిగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.