ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడితే, రాబోయే మధ్యకాలంలో బంగారం ధరలు కాస్త దిగివచ్చే అవకాశం ఉందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక అంచనా వేస్తోంది. అమెరికా డాలర్ మరింత బలపడినా, ప్రభుత్వ బాండ్ల రాబడులు పెరిగినా కూడా పసిడి ధరలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది. కేంద్ర బ్యాంకుల బంగారు కొనుగోళ్లు మందగించడం, వినియోగదారుల కొనుగోళ్లు తగ్గడం సైతం ధరలు దిగి రావడానికి దారి తీయవచ్చునని డబ్ల్యూజీసీ పేర్కొంది.
2022 నవంబరులో ఔన్స్ మేలిమి బంగారం ధర 1,429 డాలర్లు ఉండగా, ప్రస్తుతం అది రెట్టింపు కన్నా ఎక్కువగా 3,300 డాలర్లకు చేరింది. అంటే ఏడాదికి సగటున 30% రాబడి లభించిందని డబ్ల్యూజీసీ గుర్తు చేసింది. ఈ భారీ పెరుగుదలకు ప్రధానంగా మూడు అంశాలు కారణం. ఒకటి, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ పసిడి నిల్వలను గణనీయంగా పెంచుకోవడం. రెండు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రమవడం. మూడు, అమెరికా విధించిన టారిఫ్‌ల వల్ల అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకాలు ఏర్పడతాయన్న భయాలు. ఈ పరిస్థితులలో సురక్షిత పెట్టుబడిగా బంగారంపైకి భారీగా నిధుల ప్రవాహం పెరిగింది.
ఇప్పుడు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెమ్మదిగా సద్దుమణుగుతున్నాయని, వాణిజ్య ఒప్పందాలు కూడా ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని డబ్ల్యూజీసీ నివేదిక విశ్లేషించింది. ఈ పరిణామాల వల్ల బంగారంపై పెట్టుబడులు తగ్గే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో పసిడి ధరలు గణనీయంగా తగ్గాలంటే మరిన్ని పెద్ద సంస్థాగత మార్పులు అవసరమని నివేదిక అభిప్రాయపడింది. అయితే, విపరీతంగా పెరిగిన ప్రస్తుత ధరల నేపథ్యంలో, గిరాకీ తగ్గడం వల్ల మధ్యకాలానికి ధరలు తగ్గుతాయని డబ్ల్యూజీసీ అంచనా వేస్తుంది.