బెజవాడ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకుండా, నిబంధనలు అతిక్రమిస్తూ వాహనాలు నడిపేవారికి చుక్కలు చూపిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహిస్తూ భారీ ఫైన్లు వేస్తున్నారు. అంతేకాదు చిన్నారులతో కూడళ్లలో కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మద్యం సేవించి వాహనం నడిపిన ఓ యువకుడి తీరుపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది.
వివరాల్లోకి వెళితే… మద్యం మత్తులో వన్‌వేలో రాంగ్‌రూట్‌లోకి వచ్చిన ఓ యువకుడిని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని అతను ఏకంగా మూడు క్వార్టర్లు తాగానని పోలీసులకు చెప్పడం గమనార్హం. అదీ కాదన్నట్టు… ట్రాఫిక్ ఎస్‌ఐకి రూ.500 లంచం ఇవ్వబోయాడు. “ఐదొందలు ఎందుకు ఇచ్చావ్?” అని ఎస్‌ఐ ప్రశ్నించగానే.. అతని పక్కనున్న మరో వ్యక్తి కలగజేసుకుని “అయ్యో… రెండు వందలు చాలురా..” అంటూ చెప్పిన మాటలు, పోలీసుల బాడీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఇద్దరు యువకులకు ఎస్‌ఐ అక్కడే కాసేపు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై స్పందించిన ట్రాఫిక్ పోలీసులు… సదరు యువకుడిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి, బైక్‌ను సీజ్ చేశారు. చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వీడియో దిగువన చూడండి…
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.