అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడికి ఏమైంది? డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదా? ఆయన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారా? అంటే అవుననే అంటున్నారు ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్. ట్రంప్ కాళ్ల సిరల్లో లోపం ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. దీర్ఘకాల సిరల వ్యాధిగా వైద్యులు నిర్ధారించినట్లు కరోలిన్ లివిట్ ప్రకటించారు. అయితే 70 ఏళ్లు దాటినవారిలో సాధారణంగా ఈ వ్యాధి ఉంటుందని వైట్‌హౌస్ ప్రకటించింది. ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది.
ట్రంప్ కాళ్ల దిగువ భాగంలో, చీలమండ వద్ద ఈ మధ్య తరచుగా వాపు వస్తుంది. ఈ నేపథ్యంలో వైద్యులు పలు పరీక్షలు జరిపారు. దీన్ని సాధారణ సిరల లోపంగా నిర్ధారించారు. భయపడాల్సినంత పరిస్థితి లేదన్నారు. గుండె వైఫల్యం, కిడ్నీ వైఫల్యంగానీ లేదని తేలినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయన ఎలాంటి అసౌకర్యానికి గురవడం లేదన్నారు.
ఇటీవల ట్రంప్ చేతి వెనక భాగంలో గాయంలాంటిది కనిపించింది. ఆ ఫొటోలు మీడియాలో దర్శనమివ్వడంతో పలు ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. మేకప్‌తో కప్పబడి ఉన్న అతని చీలమండలలో కనిపించే వాపు మరియు చేతిలో గాయాలు గురించి పలురకాలుగా చర్చ జరిగింది.
ఏప్రిల్ ప్రారంభంలో ట్రంప్ తన పర్సనల్ వైద్యుడు కెప్టెన్ సీన్ బార్బబెల్లా సంరక్షణలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్ష తర్వాత, బార్బబెల్లా అధ్యక్షుడి మొత్తం ఆరోగ్యం గురించి వివరిస్తూ అధికారిక మెమోరాండం జారీ చేశారు.
దీర్ఘకాలిక సిరల లోపం:
కాళ్లలోని సిరలు గుండెకు రక్తాన్ని తిరిగి పంపిణీ చేసే క్రమంలో కలిగే ఆటంకమే దీర్ఘకాలిక సిరల లోపంగా సంభవిస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ యొక్క మెడ్‌లైన్‌ప్లస్ ప్రకారం, కాళ్ల సిరల్లోని కవాటాలు బలహీనపడినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు, రక్తం సమర్థవంతంగా పైకి ప్రవహించకుండా కాళ్లల్లోని సిరల్లో పేరుకుపోతుంది.
సిరల సమస్య అనేది కాలక్రమేణా తీవ్రంగా మారుతుంది. అయితే ముందస్తుగా వ్యాధిని గుర్తించడం వల్ల వ్యాధి ముదరకుండా నివారించవచ్చని వైద్యులు తెలిపారు. ఇది ముఖ్యంగా వృద్ధులు దీర్ఘకాలం కూర్చోవడం లేదా నిలబడటం, ఊబకాయం లేదా సిరల వ్యాధి యొక్క కుటుంబ చరిత్ర వంటి ప్రమాద కారకాలు ఉన్న వ్యక్తులలో సర్వసాధారణంగా సంభవిస్తుందని వైద్యులు తెలిపారు.
లక్షణాలు:
కాళ్ళలో నొప్పి లేదా తిమ్మిరి
ఎక్కువసేపు నిలబడిన తర్వాత బరువు లేదా అలసట
చీలమండల చుట్టూ వాపు
దురద లేదా జలదరింపు అనుభూతులు
చర్మం రంగు మారడం లేదా వెరికోస్ సిరలు కనిపించడం
ప్రాథమిక దశలోనే చికిత్స చేయకుండా వదిలేస్తే చీలమండలం లేదా దిగువ కాళ్ళ దగ్గర చర్మపు పూతలకి కూడా కారణం కావచ్చు.
చికిత్స:
వ్యాయామంతో ఈ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు
కొన్నిసార్లు శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది
క్రమం తప్పకుండా నడవడం
బరువును అదుపులో ఉంచుకోవడం
రక్త ప్రవాహాన్ని ప్రోత్సహించడానికి కాళ్ళ ఎత్తులో పెట్టుకోవడం