
అమరావతి, జులై 29: రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కోర్సుల్లో ఇంటర్న్‌షిప్ విధానం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇందులో కీలక మార్పులు చేశారు. ఇప్పటి వరకూ డిగ్రీ ఫస్ట్ ఇయర్ వేసవి సెలవుల్లో కమ్యూనిటీ ప్రాజెక్టు, సెకండ్ ఇయర్‌లో 2 నెలలు, ఫైనల్ ఇయర్‌లో 5, 6 సెమిస్టర్లలో ఇంటర్న్‌షిప్‌లను అమలు చేస్తున్నారు. ఈ మూడేళ్లలో 10 నెలల ఇంటర్న్‌షిప్‌నకు మొత్తం 20 క్రెడిట్లు ఇచ్చేవారు. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి మూడేళ్లకు బదులు డిగ్రీ చివరి ఏడాదిలో మాత్రమే ఒక్కసారే ఇంటర్న్‌షిప్‌లను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీంతో ఆరో సెమిస్టర్‌లో మాత్రమే ఇంటర్న్‌షిప్‌లు ఉండనున్నాయి. దీంతో క్రెడిట్లను కూడా నాలుగింటికి కుదించారు. ఉన్నత విద్యామండలి తాజా నిర్ణయంతో మొదటి, రెండో ఏడాదిలో ఇంటర్న్‌షిప్‌లను పూర్తిగా రద్దయ్యాయి.
ఆరో సెమిస్టర్‌లో ఇంటర్న్‌షిప్‌తో పాటు నాలుగు పేపర్లకు పరీక్షలు ఉంటాయి. సింగిల్ మేజర్, మైనర్ మేజర్‌కు సంబంధించి రెండేసి చొప్పున పేపర్లు ఉంటాయి. ఆరో సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ 180 గంటలు (ఎనిమిది వారాలు) మాత్రమే ఉంటుంది. సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానంలో క్వాంటమ్ కంప్యూటింగ్‌ను మేజర్, మైనర్ సబ్జెక్టులుగా తీసుకొస్తున్నారు. విద్యార్థులు కావాలంటే మేజర్‌గా లేదంటే మైనర్‌గా క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా చదువుకోవచ్చు.
బీఎస్సీ కంప్యూటర్స్ తీసుకునే విద్యార్ధులకు క్వాంటమ్ కంప్యూటింగ్ సబ్జెక్టును తప్పనిసరి చేయనున్నారు. అంటే బీఎస్సీ కంప్యూటర్స్ తీసుకునే విద్యార్ధులు క్వాంటమ్ కంప్యూటింగ్ సబ్జెక్టును తప్పనిసరిగా చదవల్సి ఉంటుంది. అలాగే డిగ్రీ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను విద్యార్థులందరూ చదవాల్సి ఉంటుంది. ఏఐకు సంబంధించిన పరిచయంతోపాటు ఆయా సబ్జెక్టుల్లో ఏఐ అమలుపై సిలబస్‌ను రూపొందిస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.