పుణె, జులై 29: మహారాష్ట్రలోని పుణెలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సాఫ్టవేర్ ఐటీ ఉద్యోగి ఆఫీసులో మీటింగ్ జరుగుతుండగా.. మీటింగ్ మధ్యలో నుంచి లేచివెళ్లిపోయి అదే ఆఫీస్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం (జులై 28) ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాసిక్‌కు చెందిన పీయూష్ అశోక్ కవాడే (23) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీరగ్ పుణెలోని హింజెవాడి ఐటీ పార్క్‌లోని అట్లాస్ కాప్కో (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. గత ఏడాది జులై నుంచి అతడు ఇదే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
సోమవారం ఉదయం ఆఫీసుకు వచ్చిన పీయూష్ అశోక్ ఆఫీస్‌లో జరుగుతున్న మీటింగ్‌కు హాజరయ్యాడు. అయితే మధ్యలో ఛాతి నొప్పిగా ఉందని చెప్పి మీటింగ్ నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత కాసేపటికే ఆఫీస్ భవనం ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన సోమవారం ఉదయం 9.30 నుంచి 10 గంటల మధ్య ప్రాంతంలో హింజావాడి ఫేజ్ 2లోని కంపెనీ ప్రాంగణంలో జరిగింది. సంఘటన స్థలంలో ఓ సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. ‘నేను మంచి కొడుకు అయితే బాగుండేవాడిని. జీవితంలో ప్రతి విషయంలో విఫలమయ్యా. నన్ను క్షమించండి. మీ సమయం వృధా చేసుకోకండి. మీకు కొడుకుగా ఉండే నాకు అర్హత నాకు లేదు అని తల్లిదండ్రులను ఉద్దేశించి అందులో పేర్కొన్నట్లు హింజెవాడి పోలీసు సీనియర్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ పంధారే తెలిపారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. పీయూష్ అశోక్ మృతికి ఉద్యోగంలో ఒత్తిడి కారణమని, విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ కురాడే అన్నారు. ఈ కేసును ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా నమోదు చేశారు. ఈ సంఘటన సహోద్యోగులు, స్థానిక నివాసితులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.