సినిమా స్క్రీన్ ఇప్పుడు దేవుళ్ల కథలను ప్రేక్షకులకు అందజేయడంలో బిజీగా ఉంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్.. ఇప్పుడు పురాణ గాథల వైపు ఊపు తిరిగింది. దేవుళ్లతో పాటు చరిత్ర మరిచిపోయిన వీరుల కథలను వెలికితీసి ప్రేక్షకులకు అందజేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం చాలా రీసెర్చ్ చేస్తున్నారు. అయితే ఇటీవల వచ్చిన ఏ యానిమేటెడ్ సినిమా.. అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది. ‘కేజీఎఫ్’, ‘సలార్’, ‘కాంతార’ వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన హోంబలే ఫిల్మ్స్.. ఇప్పుడు క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఓ ఊహించని చిత్రాన్ని అందించింది. ఆ మూవీ పేరు మహావతార్ నరసింహ. కానీ ఇది రెగ్యులర్ సినిమా కాదు.. నటీనటుల్లేని, పూర్తి యానిమేషన్‌తో రూపొందిన సరికొత్త డివోషనల్ రైడ్.
జులై 25న ఎలాంటి హడావుడీ లేకుండా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పిల్లల నుంచి పెద్దల వరకూ థియేటర్లవైపు పరుగులు పెడుతున్నారు. కేవలం మౌత్ టాక్ ఆధారంగా థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు దూసుకొస్తున్నాయి.
సాక్నిల్క్ వెబ్‌సైట్ ప్రకారం.. ఫస్ట్ డే రూ.1.75 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. రెండో రోజు రూ.4.6 కోట్లు, మూడో రోజు ఆదివారం రూ.9.5 కోట్లు వసూలు చేసింది. ట్రేడ్ అనలిస్టులు వీకెండ్ తర్వాత వసూళ్లు తగ్గుతాయన్న అంచనాలను తలకిందులు చేస్తూ సోమవారం రూ.6 కోట్లు, మంగళవారం రూ.7.5 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తంగా ఐదు రోజుల్లోనే రూ.29.35 కోట్లు నెట్ కలెక్షన్లతో సత్తా చాటింది.
ఇది పూర్తిగా యానిమేషన్ ఆధారిత చిత్రం. కానీ భావోద్వేగాలు, సీన్ల బలం వలన ప్రేక్షకులు పాత్రలతో అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు. నరసింహ స్వామి క్లైమాక్స్ సీన్ చూస్తూ భక్తితో హాళ్లల్లో భజనలు చేస్తున్నారు, పోస్టర్లకు హారతులు ఇస్తున్నారు. కొంతమంది చెప్పులు వేసుకోకుండా థియేటర్‌లోకి వెళ్లేంతగా సినిమా జనాన్ని ఆకట్టుకుంటుంది. పెద్ద స్టార్ క్యాస్ట్ లేకపోయినా, కంటెంట్ ఉంటే చాలని ‘మహావతార్ నరసింహ’ మరోసారి నిరూపించింది.
మహావతార్ నరసింహ హిందూ పురాణాల గొప్పతనాన్ని, ఆధునిక యానిమేషన్ టెక్నాలజీతో మిళితం చేసి తెరపై ఒలకబోసింది. ఇది సినిమా కాదు… అనుభూతి. ఇది ఫిక్షన్ కాదు… భక్తి. ఇది ఇండియన్ యానిమేషన్ హిస్టరీలో ట్రెండ్‌ని మార్చే టర్నింగ్ పాయింట్ కావొచ్చు .
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..