ఏపీలో రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్ట్ రెండో తేదీన ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ప్రకాశం జిల్లా పర్యటనలో చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకం తొలివిడత నిధులను రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయనున్నారు. మొత్తం రూ.3,156 కోట్ల రూపాయలను తొలివిడత సాయం కింద రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం రాష్ట్రంలోని రైతులు ఎప్పటి నుంచే ఎదురుచూస్తున్నారు. అయితే పీఎం కిసాన్ యోజనతో కలిపి ఈ పథకం అమలు చేస్తూ ఉండటంతో.. జాప్యం జరిగింది. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.14000, పీఎం కిసాన్ యోజన కింద కేంద్రం రూ.6000 కలిపి అర్హులైన రైతులకు ఏడాదికి రూ.20000 అందించనున్నారు. ఈ క్రమంలోనే అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను జూన్ నెలలోనే విడుదల చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే పీఎం కిసాన్ యోజన నిధులు విడుదలలో జాప్యం జరగటంతో అన్నదాత సుఖీభవ కూడా ఆలస్యమైంది. ఆగస్ట్ రెండో తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి పర్యటనలో పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేస్తారు. అదే రోజున చంద్రబాబు ప్రకాశం జిల్లా పర్యటనలో అన్నదాత సుఖీభవ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తారు.
మరోవైపు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇప్పటికే లబ్ధిదారుల జాబితా సిద్ధమైంది. రైతు సేవా కేంద్రాలలో ఈ జాబితాను ప్రదర్శిస్తున్నారు. జాబితాలో పేరు లేని వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించారు. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి పొందేందుకు ఈ కేవైసీ తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఈ కేవైసీ చేయించుకోని రైతులు వెంటనే రైతు సేవా కేంద్రాలలో ఈ కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే డబ్బులు జమ కావటానికి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ తప్పనిసరి.
బ్యాంక్ అకౌంట్లకు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ లేని వారు కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ కేవైసీ, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పూర్తి చేయని రైతులు వెంటనే ఆ పని పూర్తి చేయాలంటూ ఆర్టీజీఎస్ ద్వారా రైతులకు మెసేజులు పంపాలని వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు విషయాలలో ఏదైనా పెండింగ్ ఉంటే ఆ రైతులకు సందేశాలు వస్తాయి. ఆలోపే రైతు సేవా కేంద్రాలను సంప్రదించి ఈ కేవైసీ, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పూర్తి చేయించుకోవడం మంచిది.