సరికొత్త ఎమోషన్స్‌తో.. ఓ బాలిక ఎదుగుదల వెనుక దాగిన నిజాలను తెరపై ఆవిష్కరించే ప్రయత్నమే ‘గర్ల్స్ విల్ బీ గర్ల్స్’. డైరెక్ట్ ఓటీటీలో విడుదలై.. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ కథానాయిక మీరా… ఉత్తర భారతదేశంలోని హిమాలయన్ బోర్డర్ స్కూల్‌లో చదువుతో పాటు భావోద్వేగాలూ ఎదుర్కొంటూ ఎదుగుతోంది. సాంప్రదాయ నియమాలు, సమాజపు ఒత్తిడి, స్వతంత్రంగా ఎదగాలనుకునే తన తపన మధ్యలో చిక్కుకుంటుంది మీరా. అమ్మ అనిలా ఎంతగానో తన కూతురు బాగు కోరుతూ ఉన్నా… కొన్నిసార్లు ఆ ప్రేమ కూడా ఆమె కూతురికి అణచివేతలా మారిపోతుంది. ఈ సినిమాలో ప్రధానంగా అమ్మకూతుళ్ల మధ్య అభిప్రాయ భేదాలు, భావోద్వేగాల సమరం ప్రధానాంశంగా సాగుతుంది. కౌమార దశలో మనసులో కలిగే భావాలు, కొత్తగా ఏర్పడే బంధాలు ఇవన్నీ ఎంతో సహజంగా, కానీ పరిమితుల మధ్య చూపించారు.
బోల్డ్ కాన్సెప్ట్ ఉన్నా… ఈ సినిమాని తీసుకున్న పద్ధతి వయస్సుతో పాటు భావోద్వేగ పరిపక్వతను గురించి చర్చించేలా ఉంది. ప్రతి సన్నివేశం కథకు అవసరమైనంత వరకు మాత్రమే నిలబడుతుంది. ఎక్కడా అశ్లీలతకి తావు ఇవ్వకుండా తెరకెక్కించడంలో దర్శకురాలు షూచీ తలాటి సత్తా చాటారు. ఈ సినిమా ఇప్పటికే 8 అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై.. 5కి పైగా అవార్డులు గెలుచుకుంది. 2023 డిసెంబర్ 18న ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం.. రిలీజైన ఒక్కరోజులోనే అమెజాన్ ప్రైమ్ టాప్ 10లోకి ఎక్కడం గమనార్హం. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. IMDb రేటింగ్ 7.1 వచ్చిందన్నదే ఈ చిత్ర స్థాయిని సూచిస్తుంది.
ప్రముఖ నటులు అలీ ఫజల్ (మిర్జాపూర్ ఫేమ్), రిచా చద్దా (ఇన్‌సైడ్ ఎడ్జ్) తమ తొలి ఓటీటీ నిర్మాణంగా దీన్ని రూపొందించారు. వారి ప్రయత్నం వైవిధ్యమైన కథలను ప్రేక్షకుల ముందుకు తేవడంలో ఒక కొత్త దారిగా నిలుస్తోంది. ‘గర్ల్స్ విల్ బీ గర్ల్స్’ తల్లిదండ్రులు, టీనేజ్ పిల్లలు తప్పకుండా చర్చించవలసిన అంశాలతో కూడిన ఈ సినిమా.