తిరుమలలో వసతి సమస్యను అధిగమించేందుకు టీటీడీ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. భక్తులకు వసతి ఇబ్బందులు రాకుండా ఎన్నో చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. శ్రీవాణి దర్శన సమయంలో మార్పులు చేస్తూ ఈ మేరకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారిని శ్రీవాణి టికెట్లను కొనుగోలు చేసి స్వామి వారి దర్శనం చేసుకునే భక్తులకు వసతి సమస్య రాకుండా ప్రయత్నిస్తోంది. శ్రీవాణి దర్శన సమయాల్లో మార్పు చేయాలని నిర్ణయించింది.
ప్రస్తుతం ఉదయం 10 గంటలకు ఉన్న దర్శన సమయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మార్పు చేసింది. ఏ రోజుకు ఆ రోజు శ్రీవాణి దర్శన టికెట్ల జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆఫ్ లైన్‌లో శ్రీవాణి దర్శన టికెట్లు పొందే భక్తులకు అదే రోజు దర్శనం కల్పించనుంది.
తిరుమలలో దర్శన సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. తిరుమలలోని గోకులం గెస్ట్ హౌస్ లో అధికారులతో సమావేశం నిర్వహించిన టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తిరుమలలో వసతి గృహాలపై భారం తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్న టిటిడి.. ఆగస్టు 1 నుంచి నూతన విధానం అమలు చేయనుంది. తిరుమలలో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీవాణి టికెట్లను జారీ చేయనుంది. రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు దర్శన టికెట్లు జారీ చేయనుంది. తిరుమలలో ఆఫ్ లైన్ ద్వారా 800 టికెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 200 టికెట్లు జారీ చేస్తున్న టీటీడీ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆక్టోబర్ 31 వరకు ఆన్ లైన్ లో శ్రీవాణి టికెట్లను పొందిన భక్తులకు మాత్రం యథావిధిగానే ఉదయం 10 గంటలకే దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1వ నుండి ఆఫ్ లైన్, ఆన్ లైన్ శ్రీవాణి టికెట్లను పొందిన భక్తులకు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద సాయంత్రం 4.30 లకు రిపోర్టింగ్ సమయం కేటాయిస్తోంది. శ్రీవాణి టికెట్ ల ద్వారా టిటిడి కి రోజు రూ. కోటిన్నర ఆదాయం వస్తుండగా ఏటా దాదాపు రూ. 500 కోట్లు వస్తోంది.
శ్రీవాణి దర్శన సమయంలో మార్పు పై తీసుకున్న నూతన విధానం ఆగస్టు ఒకటి నుంచి 15 వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని టిటిడి భావిస్తోంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం వల్ల శ్రీవాణి టికెట్ దర్శనం కోసం భక్తులకు సుమారుగా 3 రోజుల సమయం పడుతున్నట్లు టీటీడీ గుర్తించింది. దీంతో వసతిఇబ్బంది, సమయం వృధా కాకుండా ఉండేందుకు కొత్త ఆలోచనకు టీటీడీ శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. నూతన విధానం తో భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం చేసుకునే వెసులుబాటు కలుగుతోందని భావిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.