ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ తప్పనిసరి అయిపోయింది. మిగిలిన ఆహారం కానీ, వండని పదార్థాలు కానీ.. అన్నీ ఫ్రిజ్‌లో పెడుతూ ఉంటాం. అయితే ముఖ్యంగా మాంసం లాంటివి ఎంతకాలం ఫ్రిజ్‌లో సురక్షితంగా ఉంచొచ్చో మనలో చాలా మందికి సరిగా తెలియదు. ఈ విషయంపై నిపుణులు కొన్ని ముఖ్యమైన సలహాలు ఇచ్చారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
2 రోజులకు మించి ఫ్రిజ్ లో వద్దు
వండిన చికెన్ లేదా మటన్ ను రెండు రోజుల కంటే ఎక్కువ ఫ్రిజ్ లో ఉంచితే.. అందులో సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల ఆ ఆహారం పాడైపోతుంది. అలాంటి మాంసం తింటే కడుపు నొప్పి, వాంతులు, అజీర్తి, శరీరం డీహైడ్రేట్ అవ్వడం లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మాంసం లోని ముఖ్యమైన పోషకాలు కూడా పోతాయి.
పచ్చి మాంసానికి గడువు
పచ్చి మాంసాన్ని కూడా ఎక్కువసేపు ఫ్రిజ్ లో ఉంచడం అస్సలు మంచిది కాదు. ఫ్రిజ్ లో రెండు రోజులకంటే ఎక్కువ రోజులు ఉంచితే మాంసంలోని ప్రోటీన్లు, విటమిన్లు తగ్గిపోతాయి. అంతేకాకుండా సూక్ష్మజీవులు దానిపై పెరుగుతూ.. ఆ మాంసాన్ని పాడైపోయేలా చేస్తాయి. ఎండాకాలంలో ఈ ప్రభావం ఇంకా వేగంగా కనిపిస్తుంది. గరిష్టంగా ఒక రోజు మాత్రమే పచ్చి మాంసాన్ని ఫ్రిజ్‌లో ఉంచమని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి..?
మాంసాన్ని ఫ్రిజ్‌లో పెట్టేటప్పుడు గడువును గుర్తుంచుకోవాలి. రెండు రోజుల లోపు వాడకపోతే ఫ్రీజర్‌లో గట్టిగా నిల్వ చేయడం లేదా అసలు వాడకపోతే పారేయడం మంచిది. పాడైన మాంసాన్ని మళ్ళీ ఉడికించినా.. హాని చేసే సూక్ష్మక్రిములు చనిపోకపోవచ్చు. అందుకే ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మేలు.
చికెన్, మటన్ లాంటి మాంసాహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఎంతకాలం ఉంచాలో స్పష్టంగా తెలుసుకోవాలి. ఎక్కువలో ఎక్కువ రెండు రోజులకే పరిమితం చేయండి. ఎండాకాలంలో అయితే ఒక రోజు మాత్రమే ఉంచడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)