Srivani Tickets Darshan Timings in Tirumala: భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని.. వారికి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవాణి దర్శనం వేళల్లో టీటీడీ తాజాగా మార్పులు చేసింది. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి తిరుమలలో శ్రీవాణి టికెట్లు కలిగిన భక్తులకు దర్శనం వేళలు మారనున్నాయి. ఇకపై శ్రీవాణి దర్శనం టికెట్లను ఏరోజుకు ఆ రోజు జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఆగస్ట్ ఒకటి నుంచి ఆగస్ట్ 15 వరకూ ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

*హైదరాబాద్ దంపతుల పెద్దమనసు.. తిరుమల శ్రీవారికి విరాళంగా ఇల్లు.. ఎంత విలువైందో తెలుసా?
శ్రీవాణి దర్శనం టికెట్లను ప్రస్తుతం ఆన్‌లైన్‌తో పాటుగా ఆఫ్‌లైన్‌లోనూ టీటీడీ జారీ చేస్తోంది. అయితే ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం కారణంగా శ్రీవాణి దర్శనం టికెట్లు ఆఫ్‌లైన్‌లో పొందిన భక్తులకు శ్రీవారి దర్శనానికి మూడు రోజుల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో ఇకపై ఏరోజుకు ఆ రోజు శ్రీవాణి దర్శనం టికెట్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఏఈవో తెలిపారు. శ్రీవాణి టికెట్లు జారీచేసిన రోజే శ్రీవారి దర్శనం కల్పించాలని.. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఆగస్ట్ 15 వరకూ ఈ విధానం ప్రయోగాత్మకంగా అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది.
ఇక శ్రీవాణి దర్శనం టికెట్లను తిరుమలలో ఉదయం పది గంటల నుంచి జారీ చేస్తారు. మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన శ్రీవాణి దర్శనం టికెట్లు జారీ చేస్తారు. అలాగే రేణిగుంట ఎయిర్‌పోర్టులో ఉదయం 7 నుంచి దర్శన టికెట్ల కోటా ఉన్నంత వరకూ వీటిని జారీ చేస్తారు. ఆఫ్‌లైన్ శ్రీవాణి దర్శనం టికెట్లు రోజూ వేయి వరకూ అందుబాటులో ఉంటాయి. అందులో తిరుమలలో ఆఫ్ లైన్ ద్వారా 800 టికెట్లు, రేణిగుంట ఎయిర్‌పోర్టులో 200 టికెట్లు జారీ చేస్తారు. శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
తిరుమల శ్రీవారికి ఖరీదైన కానుకలు.. 2.5 కేజీల బంగారంతో
మరోవైపు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటికే ఆక్టోబర్ 31 వరకూ ఆన్ లైన్‌లో శ్రీవాణి టికెట్లను పొందిన భక్తులు యథావిధిగా ఉదయం 10 గంటలకే దర్శనానికి అనుమతిస్తారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి శ్రీవాణి దర్శనం ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ టికెట్లు పొందిన వారిని సాయంత్రం 4:30 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. భక్తులు ఉదయం 10 గంటలకు మాత్రమే శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రం వద్దకు రావాలని టీటీడీ కోరింది. కొత్త విధానంతో శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులు ఆ రోజునే శ్రీవారిని దర్శించుకునేందుకు వీలు అవుతుందని టీటీడీ చెప్తోంది.