Jennifer Mistry: సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపుల సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. ప్రముఖ టీవీ సీరియల్ ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’లో ‘రోషన్ సోధీ’ పాత్రతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటి జెన్నీఫర్ మిస్త్రీ బన్సివాల్, తాను సినీ పరిశ్రమలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను, ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్‌ను ధైర్యంగా వెల్లడించింది.
గతంలోనే ఈ విషయాలపై ఆమె నోరు విప్పినప్పటికీ, తాజా ఇంటర్వ్యూలలో మరిన్ని వివరాలను వెల్లడించింది. ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ నిర్మాత అసిత్ కుమార్ మోదీ నుంచి తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని జెన్నీఫర్ ఆరోపించింది. 2018లో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ, తాను షో ఆపరేషన్స్ హెడ్ సోహైల్ రమణిపై ఫిర్యాదు చేయడానికి నిర్మాత అసిత్ మోదీ వద్దకు వెళ్లినప్పుడు, తన ఫిర్యాదును పక్కన పెట్టి, తన శరీరంపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని తెలిపారు.
ఆ తర్వాత 2019లో సింగపూర్‌లో షూటింగ్ జరుగుతుండగా, మరో దారుణమైన అనుభవం ఎదురైందని జెన్నీఫర్ వెల్లడించారు. ఒక కాఫీ షాప్‌లో అసిత్ మోదీ తన పెదాలను చూసి అసభ్యకరంగా మాట్లాడారని, ముద్దు పెట్టుకోవాలని ఉందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మాటలు తనను తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేశాయని, ఎంత ప్రయత్నించినా వాటిని విస్మరించలేకపోయానని ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి
ఈ సంఘటనలు తనను మానసికంగా చాలా భయపెట్టాయని, అందుకే చివరకు 2023లో ఆ షో నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని జెన్నీఫర్ వివరించారు. ఈజీమైట్రిప్ వంటి సంస్థలు కూడా ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’తో తమ స్పాన్సర్‌షిప్‌ను రద్దు చేసుకున్న సందర్భాలు గతంలో ఉన్నాయి.
సినీ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించే ఎంతో మంది అమ్మాయిలు ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులకు గురవుతున్నారని, అధికారం ఉన్నవారు తమ పదవులను దుర్వినియోగం చేస్తూ అమాయకులను లొంగదీసుకుంటున్నారని జెన్నీఫర్ మిస్త్రీ వ్యాఖ్యానించారు. ఆమె ధైర్యంగా బయటపెట్టిన ఈ విషయాలు పరిశ్రమలో మహిళల భద్రత, పని వాతావరణంపై మరోసారి తీవ్ర చర్చకు దారి తీశాయి. న్యాయం కోసం ఆమె చేస్తున్న పోరాటానికి అనేక మంది మద్దతు తెలుపుతున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..