
ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆదివాసీలు బతుకులు మాత్రం మారడం లేదు.. అభివృద్ధికి ఆమడ దూరములో కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు. హాస్పిటల్స్, రోడ్డు సైకర్యాలు లేక వాళ్లు నానా అవస్థలు పడుతున్నారు. కొందరు అనారోగ్యం బారిన పడి సరైన సమయంలో చికిత్స అందక ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఏజెన్సీలో చోటుచేసుకుంది. కరకగూడెం మండలం అశ్వాపురంపాడు అనే వలస గిరిజన గ్రామానికి చెందిన నందమ్మ అనే మహిళ రెండు రోజుల క్రితం అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ క్రమంలోనే ఆమె చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి లో మృతి చెందింది.
అయితే ఆమె మృతదేహాన్ని గ్రామానికి తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వాళ్ల గ్రామానికి రహదారి లేకపోవడంతో ప్రధాన రహదారి నుండి జెట్టి కట్టి మృతదేహాన్ని చిమ్మ చీకట్లో మూడు కిలోమీటర్లు మోసుకెళ్లారు గ్రామస్తులు. దీంతో మృతదేహం కరకగూడెం చేరుకునే సరికి రాత్రి తొమ్మిది గంటలు దాటింది. ఇక వాళ్ల మరుసటి రోజు అంత్యక్రియలు నిర్వహించారు.
పాలకులు మారుతున్న ప్రభుత్వాలు మారుతున్న ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల కష్టాలు మాత్రం తీరడం లేదు. వలస గిరిజనులు వచ్చి ఏళ్ళు గడుస్తున్న నేటికీ వారు నివసిస్తున్న గ్రామాలకు రహదారులు లేకపోవడం చూస్తుంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. ప్రభుత్వాలు, అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ గ్రామాలకు రహదారి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వలస గిరిజనులు వేడుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.