Tirumala Concrete Policy Document: తిరుమలలో పెరుగుతున్న ట్రాఫిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఈవీ పాలసీతో పాటు పలు నియంత్రణలను తీసుకురానుంది. ఇదిలా ఉండగా, శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు ఎన్.బి.ఏ గుర్తింపు లభించింది. మరోవైపు తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో తులసి మహత్యం ఉత్సవం జరగనుంది. ఈ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి పూర్తి కథనం చదవండి.
హైలైట్:
- తిరుమలలో వాహనాలపై పాలసీ డాక్యుమెంట్
- ఈవీ పాలసీ, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బలోపేతానికి
- పర్యావరణ కాలుష్యాన్ని నివారించేలా ప్లానింగ్

శ్రీ పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు ఎన్.బి.ఏ అక్రిడిటేషన్
టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు 2028వ సంవత్సరం వరకు నేషనల్ బోర్డు అక్రిడిటేషన్ (ఎన్.బి.ఏ) మంజూరు చేసింది. పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎం. పద్మావతమ్మ, అధ్యాపకులు, సిబ్బంది సమిష్టి కృషితో పాలిటెక్నిక్ కళాశాలకు నేషనల్ బోర్డ్ అక్రెడిటేషన్ మంజూరు అయ్యేలా పనిచేశారని అభినందించారు టీటీడీ ఈవో జె శ్యామలరావు. ఇదే స్ఫూర్తితో మరింతగా కష్టించి జాతీయ స్థాయిలో కళాశాలకు గుర్తింపు తీసుకురావాలని, మరింత నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు.
శ్రీ పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు ఎన్.బి.ఏ గడవు ముగియడంతో ఎన్.బి.ఏ ప్రతినిధులు గత నెలలో కళాశాలలో ఇన్ స్పెక్షన్ నిర్వహించి 2028 వరకు అక్రిడిటేషన్ ఇచ్చారు. గత నెలలో న్యూఢిల్లీ నుండి విచ్చేసిన ఎన్.బి.ఏ నిపుణుల బృందం కళాశాలలోని ప్రయోగశాలలు, అధ్యాపకులు, సిబ్బంది వివరాలు, రికార్డులు, మౌళిక సదుపాయాలను పరిశీలించారు. కళాశాలలో బోధన, ల్యాబ్స్, లైబ్రరీ, బోధన తదితర అంశాలపై విద్యార్థుల నుండి ఫీడ్ బ్యాక్ సేకరించారు. నేషనల్ బోర్డ్ నిబంధనల మేరకు పాలిటెక్నిక్ కళాశాలను నిర్వహిస్తుండడంతో ఎన్.బి.ఏ మంజూరు అయింది.
వీఐపీలు ఇలా చేయండి.. తిరుమల శ్రీవారి దర్శనంపై వెంకయ్య సలహా
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 6వ తేదీ తులసి మహత్యం ఉత్సవం ఘనంగా జరుగనుంది. స్వామివారికి తులసి దళం అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ శుద్ధ ద్వాదశినాడు తులసి ఆవిర్భావం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం 8నుండి 9.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం ఉదయం 9.39 నుండి 10.30 గంటల వరకు బంగారు వాకిలి చెంత స్వామివారి ఆస్థానం ఘనంగా జరుగనుంది. ఇందులో అర్చకులు తులసి మహత్యం పురాణ పఠనం చేస్తారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు.