AP High Court On TCS Land Allocation: విశాఖపట్నంలో టీసీఎస్‌కు భూముల కేటాయింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంలో తప్పులేదని, కంపెనీల రాకతో రాష్ట్రానికి కలిగే లాభాలను పరిశీలించాలని సూచించింది. టీసీఎస్ రూ.1370 కోట్ల పెట్టుబడితో 12 వేల ఉద్యోగాలు ఇస్తామని చెబుతోందని కోర్టు పేర్కొంది. తక్కువ ధరకే భూమిని కేటాయించినా, సంస్థ రాకతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కేటాయింపులు తుది తీర్పుకు లోబడి ఉంటాయని తెలిపింది.
హైలైట్:
- విశాఖపట్నంలో టీసీఎస్‌కు భూ కేటాయింపు
- 99 పైసలకే 21 ఎకరాలు ఇచ్చారని పిటిషన్
- దీనిపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది

రాష్ట్ర ప్రభుత్వం టీసీఎస్‌కు విశాఖపట్నంలో 21.16 ఎకరాల భూమిని లీజుకు ఇస్తోందని ప్రభుత్వ ప్రత్యేక తరఫు లాయర్ హైకోర్టుకు తెలిపారు. భూమి అమ్మడం లేదన్న విషయాన్ని గమనించాలని.. భూమిని అమ్మేస్తున్నట్లుగా పిటిషనర్ చేస్తున్న వాదనలో నిజం లేదని కోర్టుకు వివరించారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేటాయింపులు తుది తీర్పుకు లోబడి ఉంటాయని.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 21న విశాఖపట్నంలో TCSకు 21.16 ఎకరాల భూమిని.. ఒక్కో ఎకరాకు రూ.99 పైసల చొప్పున కేటాయించింది. TCS కంపెనీకి తక్కువ ధరకు భూమి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ రైట్స్ (ఎస్‌పీసీపీఈఆర్) అధ్యక్షుడు నక్కా నమ్మి ఈ పిటిషన్ వేశారు. రూ.529 కోట్ల విలువైన స్థలాన్ని TCSకు తక్కువ ధరకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషన్‌లో ఆరోపించారు.