తెలంగాణలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. విద్యుత్ విభాగం ప్రక్షాళనకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ ఉండగా.. మరో డిస్కం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని.. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంధన శాఖపై జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి, ప్రభుత్వ విద్యా సంస్థలకు, గృహజ్యోతి పథకానికి ఇచ్చే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలని.. దీనికి రాష్ట్రమంతా ఒకే యూనిట్‌గా కొత్త డిస్కమ్ పరిధి ఉండాలని సీఎం తెలిపారు.
కొత్త డిస్కం ఏర్పాటు వల్ల ఇప్పుడున్న విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు మెరుగుపడి.. జాతీయ స్థాయిలో రేటింగ్ పెరుగుతుందన్నారు. డిస్కంల పునర్‌వ్యవస్థీకరణతో పాటు విద్యుత్ సంస్థలపై ఇప్పుడున్న అప్పులభారం తగ్గించాలని సూచించారు. అప్పులపై పది శాతం వరకు వడ్డీలు చెల్లిస్తూ డిస్కంలు డీలా పడ్డాయని తెలిపారు. తక్కువ వడ్డీలు ఉండేలా రుణాలను రీస్ట్రక్చర్ చేసుకునేలా వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యుత్ సంస్థల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు సీఎం. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం అనువైన భవనాలను గుర్తించే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటుకు జిల్లాల వారీగా కలెక్టర్లు అనువైన భవనాలను యుద్ధప్రాతిపదికన గుర్తించాలని చెప్పారు సీఎం. దీని కోసం ఆర్అండ్‌బీ శాఖతో సమన్వయం చేసుకుని రాష్ట్ర సచివాలయానికి సౌర విద్యుత్ అందించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎండాకాలంలో సచివాలయంలో వాహనాల పార్కింగ్ ఇబ్బందిగా మారిన నేపథ్యంలో వాహనాల పార్కింగ్‌నకు అనువుగా సోలార్ రూఫ్‌టాప్ షెడ్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇందిర సోలార్ గిరి జల వికాసం పథకం రాష్ట్రంలోని అన్ని గిరిజన, ఆదివాసీ తండాలు, ఏజెన్సీ ఏరియాల్లో అమలు చేయాలని నిర్దేశించారు. వచ్చే మూడేళ్లలో 2 లక్షల 10 వేల మంది ఎస్టీ రైతులకు ఈ పథకం వర్తింపజేయాలని, 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ పంపుసెట్లను అందించి లక్ష్యాన్ని చేరుకోవాలన్న సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.