మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లోని మారుమూల గ్రామం కలమడుగు కేంద్రంగా పెద్ద ఎత్తున సైబర్ కుట్రలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు మంచిర్యాల పోలీసులు. కేంద్ర నిఘా వ్యవస్థ హెచ్చరికలతో అలర్ట్ అయిన జిల్లా పోలీసులు.. కార్డన్ సర్చ్ చేపట్టి.. నలుగురు సభ్యుల ముఠాను పట్టుకున్నారు. మారుమూల గ్రామంలో ఇంటర్నేషనల్ రేంజ్ లో సైబర్ సెటప్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న తీరును చూసి పోలీసులు షాక్ కు గురయ్యారు. నిందితుల వద్ద నుండి 350 సిమ్ లు.. టాస్క్ బాక్స్ లు, సిమ్ ఐఎంఈఐ నెంబర్ లను మార్చే న్యూ టెక్నాలజీ పరికరాలను , ల్యాప్ ట్యాప్ లను సీజ్ చేశారు పోలీసులు. ముగ్గురును అరెస్ట్ చేసిన పోలీసులు కీలక నిందితుడి కోసంగాలింపు చర్యలు చేపట్టారు.
మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన యాండ్రాపు కామేష్, జగిత్యాల జిల్లాకు చెందిన బాపయ్య యాదవ్, మధుకర్ యాదవ్, మంచిర్యాల జిల్లాకు చెందిన గోట్ల రాజేష్ యాదవ్ నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నిందితులు గతంలో కాంబోడియాలో పనిచేసి, అక్కడి నుంచి భారతదేశంలోకి సైబర్ మోసాలకు అవసరమైన పరికరాలు, ఫేక్ సిమ్‌లు, ల్యాప్‌టాప్‌లు దిగుమతి చేసుకుని, ప్రత్యేకంగా ఓ మారుమూల గ్రామంలో అద్దె ఇంట్లో ఫ్రాడ్ సెటప్ ఏర్పాటు చేసుకున్నారు. నిందితుల వద్ద నుండి 262 ఆధారాలు లేని సిమ్ కార్డులతో పాటు 72 జియో, 79 ఎయిర్‌టెల్, 111 వోడాఫోన్ సిమ్‌లు, ఫైబర్ నెట్, డీలింక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఈ నిందితుల్లో జగిత్యాల జిల్లా లక్ష్మీ పూర్(వీ) గ్రామానికి చెందిన భావు బాపయ్య 2024 జూలైలో కాంబోడియా దేశానికి వెళ్లి రెస్టారెంట్లో పనికి కుదిరిన సమయంలో… కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వేదాంతపురం గ్రామానికి చెందిన పాలవల్సుల సాయికృష్ణ ఉరఫ్ జాక్ ఉరఫ్ రాజు అనే కీలక నిందితుడు పరిచయం అయ్యాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో బాపయ్య ఇండియాకు తిరిగి వచ్చాడు. ఓ రోజు వాట్సాప్ లో బాపయ్యను సాయి కృష్ణ సంప్రదించి.. జన్నారం అటవి ప్రాంతంలో తనకు ఒక అద్దె ఇల్లు కావాలని కోరాడు. దీనికి బాపయ్య తన చెల్లెలి భర్త, జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన గొట్ల రాజేశ్ తో కలిసి కలమడుగు గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ ఏడాది మేలో సాయికృష్ణ వాట్సాప్ లో బాపయ్యను సంప్రదించి.. ఓ వ్యక్తి ద్వారా కీలక సామాగ్రి పం పిస్తున్నానని, దానిని జగిత్యాల బస్టాండ్ కు వెళ్లి తీసుకుని అద్దె గదిలో ఉంచాలని సూచించాడు. ఆ సమయంలో బాపయ్య అందుబాటులో లేకపోవడంతో అతడి తమ్ముడు మధుకర్ సామాగ్రిని తీసుకెళ్లి కలమడుగులోని అద్దె గదిలో ఉంచారు. అనంతరం నెట్ కనెక్షన్, ఇన్వర్టర్, ల్యాప్టాప్ సమకూర్చుకున్నారు.
ఇవి కూడా చదవండి
ఆంధ్రప్రదేశ్ మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన యాండ్రాపు కామేశ్ అనే వ్యక్తిని నెలకు రూ.70వేల జీతం, వాటా ఇస్తానని చెప్పి సాయి కృష్ణా ఉద్యోగానికి కుదుర్చుకున్నాడు. కామేశ్ అప్పటికే ఢిల్లీలోని ఐవీల్స్ కంపెనీలో డీజిల్ సేల్స్ అకౌంట్ కీ మేనేజర్‌గా పనిచేసిన అనుభవం ఉండటం.. తాజాగా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లో లక్షలు పోగొట్టుకోవడంతో ఈ పనికి ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో బాపయ్య, మధుకర్, గొట్ల రాజేశ్, కామేశ్ కలిసి జన్నారం కలమడుగు అద్దె గదిలో డీలింక్ రూటర్లు, ల్యాప్టాప్, సిమ్ ప్యానల్ ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించారు. సాయికృష్ణ టెలిగ్రాం యాప్ ద్వారా చెప్పినట్లు ఈ నలుగురు ప్యానెల్లో సిమ్లు అమర్చడం, కొంత సమయం తర్వాత ఆ సిమ్ లను తీయడం, కొత్త సిమ్ లు పెట్టడం చేస్తూ ఏకంగా ఐఎంఈఐ నెంబర్ లను గుర్తించని రేంజ్ లో సిమ్ లను తయారు చేశారు. ఈ సిమ్ లతో కాల్స్ చేస్తే ఎక్కడా పట్టుబడకుండా పెద్ద ఎత్తున కుట్రకు పాల్పడ్డారు. ఒకే నెంబర్ తో కాల్స్ దేశ విదేశాల నుండి వెలుతున్నట్టు గుర్తించిన ఢిల్లీ టెలికమ్యూనికేషన్ టీం అలర్ట్ అయ్యారు. లోతుగా దర్యాప్తు చేపట్టిన జాతీయ నిఘా విభాగం.. ఈ భారీ సైబర్ కుట్ర మంచిర్యాల జిల్లా జన్నారం సెంటర్ గా సాగుతున్నట్టు గుర్తించి తెలంగాణ సైబర్ విభాగాన్ని అలర్ట్ చేసింది. రాష్ట్ర సైబర్ విభాగం ఇచ్చిన సమాచారం తో రంగంలోకి దిగిన మంచిర్యాల జిల్లా పోలీసులు ముగ్గురు నిందితులను వల పన్ని పట్టుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ కాల్స్ డీ లింక్స్ కార్యకలపాలు ఒక మారు మూల గ్రామం నుండి సాగుతుండటంతో ఈ భారీ సైబర్ కార్యకలపాల వెనుక కింగ్ పిన్ ఎవరన్నది తేల్చే పని లో పడ్డారు మంచిర్యాల పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.